మాల్దీవ్స్ మరియు భారత్‌ల మధ్య గతేడాది దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ద్వీప దేశానికి పర్యాటక రంగంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మాల్దీవ్స్‌కు వెళ్లే పర్యాటకుల్లో 2023లో ఇండియా అగ్రస్థానంలో ఉండగా.. 2024 నాటికి ఆరో స్థానానికి చేరుకుంది. ఆ విషయాన్ని గుర్తించిన అక్కడి సర్కారు 2025లో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులను రప్పించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే ఇండియాలో నెలవారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023లో ద్వీపదేశానికి 18,78,543 మంది సందర్శకులు వచ్చారు. ఇందులో భారతీయుల సంఖ్య 2.09,193. అయితే గతేడాది అంటే 2024లో 20,64,615 మంది అక్కడకు వెళ్లారు. ఇందులో భారతీయుల సంఖ్య 1.30,805కి పడిపోయింది. అయితే 2024లో అత్యధిక పర్యాటకులు చైనా నుంచి వెళ్లగా.. రష్యా రెండో స్థానంలో నిలిచింది. 2023లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. 2024లో ఆరో స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా 2024 జనవరి నుంచి అక్టోబర్ వరకు ద్వీప దేశానికి భారత పర్యాటకుల సందర్శన బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ సంఖ్య పెరిగినప్పటికీ పెద్దగా ఉపయోగం లేదు.
ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అక్కడి సర్కారు 2025లో 3 లక్షల మంది భారత పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని నేరుగా మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అబ్దుల్లా గియాస్ తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విషయంలో భారత్‌లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వివరించారు. ముఖ్యంగా తొలిసారి ఇండియా మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు ఓ బ్రాండ్ అంబాసిడర్‌ను కూడా నియమించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే మాల్దీవ్స్‌లో క్రికెట్ సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
అలాగే భారత దేశంలోని మరిన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు ఇరుదేశాల విమానయాన సంస్థలతో పని చేస్తున్నామని ప్రకటించారు. కొత్తగా చైన్నె, పుణే, కోల్‌కతా వంటి నగరాల్లో విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇదంతా ఇలా ఉండగా.. కరోనా తర్వాత 2020 నుంచి 2023 వరకు మాల్దీవ్స్‌కు వెళ్లే పర్యాటకుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉండేది.
కానీ ముగ్గురు ద్వీప దేశ మంత్రులు సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయగా.. అప్పటి నుంచి భారతీయులు మాల్దీవ్స్‌కు వెళ్లడంపై ఆసక్తి తగ్గించుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు సైతం ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయి. అయితే భారతీయులను ఆకర్షించేందుకు ఆ దేశ పర్యాటక రంగం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. చూడాలి మరి ఈసారి చేపట్టబోయే చర్యలతోనైనా భారతీయులు అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారా లేదా అనేది.