ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేలాది మంది భారతీయులు వెనక్కి..!అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం

international |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 11:10 PM

మొదటినుంచి అమెరికా ఫస్ట్ నినాదాన్ని వినిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అందుకు తగ్గట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన నిర్ణయాలకు ఉపక్రమిస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు నుంచే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులపై కొరఢా ఝళిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అమెరికా గడ్డ నుంచి బయటికి పంపించాలని కంకణం కట్టుకున్నారు. చట్టబద్ధంగా అమెరికాకు వచ్చిన వారు మాత్రమే అక్కడ నివసించాలని.. అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చిన వారిని తమ దేశాలకు తీసుకెళ్లాలని ఇప్పటికే ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచించారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. దీంతో అసలు అమెరికాకు అక్రమంగా వెళ్లిన భారతీయులు ఎంత మంది ఉన్నారు. ట్రంప్ అమలు చేస్తున్న ఈ విధానంతో ఎంత మంది ప్రభావితులు కానున్నారు అనేది తీవ్ర చర్చకు దారితీస్తోంది.


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన భారతీయులను సీ-17 మిలటరీ విమానంలో వెనక్కి పంపించేస్తున్నారు. మొదటి విడతలో 205 మందితో కూడిన విమానం మంగళవారం టెక్సాస్‌లో బయల్దేరింది. ఇది పంజాబ్‌లోని అమృత్‌సర్‌ చేరుకోనుంది.


అమెరికాలో ఉంటూ సరైన పత్రాలు లేనివారిని లేదా అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపేంచేందుకు వాణిజ్య, సైనిక విమానాలను ఉపయోగిస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాదిమంది భారతీయులపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో భారత్‌కు చెందిన అక్రమ వలసదారులు 7.25 లక్షల మంది ఉన్నట్లు ఒక అంచనా ఉంది. వారిలో 18 వేల మందిని తిరిగి భారత్‌కు పంపించేందుకు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే లిస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ 7.25 లక్షల మంది భారతీయుల్లో ఎక్కువమంది వీసా గడువు పూర్తి అయిన తర్వాత కూడా అక్కడే ఉంటున్నట్లు సమచారం.


ఎల్‌ పాసో, టెక్సాస్‌, శాన్‌ డియాగో, కాలిఫోర్నియాల నుంచి 5 వేల మంది వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను బహిష్కరించి.. వారి దేశాలకు తరలించేందుకు అమెరికా అధ్యక్ష భవనం పెంటగాన్‌ చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్వాటెమాల, పెరూ, హోండురాస్‌లకు అమెరికా సైనిక విమానాలు వలసదారులను పంపించాయి.


ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికా సహా ఇతర దేశాలకు వలస వెళ్లి.. తిరిగి భారత్‌కు రావాలనుకునే వారిని ఆహ్వానించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నట్లు గతనెలలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తేల్చి చెప్పారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తూ.. భారత్‌కు తిరిగి పంపించే వారి సంఖ్య ఎంత అనేది ఇంకా ఫైనల్ కాలేదని వివరించారు. చట్టబద్ధమైన వలసలకే తాము మద్దతిస్తామని చెప్పిన జైశంకర్.. భారతీయుల ప్రతిభకు ప్రపంచ స్థాయి గుర్తింపు, అవకాశాలు లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే అదే సమయంలో అక్రమంగా వెళ్లేవారిని మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు ఇటీవల వాషింగ్టన్‌లో స్పష్టం చేశారు. తమ దేశ పౌరులు ఎవరైనా అక్రమంగా వలస వెళ్లినట్లు గుర్తిస్తే.. వారిని న్యాయబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిద్ధంగా ఉంటామని అమెరికా సహా అన్ని దేశాలకు జైశంకర్ స్పష్టం చేశారు.


మరోవైపు.. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ దేశాలైనా వ్యతిరేకిస్తే ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్‌ ఆదేశాలను ధిక్కరిస్తే ఆ దేశాలకు అమెరికా కాంగ్రెస్‌ ఆంక్షలు విధిస్తుందని అధికారులు హెచ్చరించారు. అక్రమ వలసదారుల్ని అనుమతించబోమని కొలంబియా చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ సర్కార్.. కొలంబియా ఉత్పత్తులపై 25 శాతం ట్యాక్స్ విధించి గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో వెనక్కి తగ్గిన కొలంబియా.. తమ దేశ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు అంగీకరించడంతో ఆ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. మెక్సికో, కెనడాలను కూడా అధిక టారిఫ్‌లతో భయపెట్టిన ట్రంప్‌.. తాజాగా కాస్త ఊరట కల్పించారు. అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తామని మెక్సికో, కెనడా అధినేతలు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా నెల రోజుల పాటు అధిక టారిఫ్‌లను వాయిదా వేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa