ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడు ప్రిన్స్ ఆగాఖాన్ మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 11:06 PM

బిలియనీర్, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, ప్రిన్స్ ఆగా ఖాన్ కన్నుమూశారు. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో గల తన స్వగృహంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం 88 ఏళ్ల వయసు కల్గిన ఆయన గతకొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండగా.. బుధవారం రోజు వేకువజామున చనిపోయారు. ఈ విషయాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే ఆగాఖాన్ కుటుంబంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలియజేసింది. ఆగాఖాన్ మృతి వార్త తెలుసుకున్న ఇస్మాయిలీ ముస్లింలు సైతం కన్నీరు పెడుతున్నారు. ఆయన ఆత్మయకు శాంతి చేకూరాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఆగాఖాన్ 1957 జులై 11వ తేదీన స్విట్జర్లాండ్‌లో జన్మించారు. అయితే ఈయనకు బ్రిటన్ పౌరసత్వం ఉండగా.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తనకు 20 ఏళ్ల వయసు ఉండగానే ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువగా నియమితుడయ్యాడు. ముఖ్యంగా 1957వ సంవత్సరంలోనే 49వ వంశపారంపర్య ఇమామ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలోనే 1967లో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు.


దీని ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా వందలాది ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతికి సంస్థలను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ వాటిని చక్కగా నిర్వహిస్తున్నారు. వీటి వార్షిక బడ్జెట్ సుమారు 1 బిలియన్ డాలర్లు. ముఖ్యంగా ఆగాఖాన్ పేరు మీద ఉన్న ఆస్పత్రులు, బడులు.. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, తజకిస్థాన్ దేశాల్లో ఇప్పటికీ పని చేస్తున్నాయి. అగాఖాన్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2015లో ఆయనను పద్మవిభూషన్‌తో సత్కరించింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆగాఖాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


సంపద పోగు చేయడం తప్పు అనే భావన తమకు లేదని.. కాకపోతే ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ప్రతీ ఒక్కరూ తమ సంపదలో కొంత డబ్బును సమాజ బాగు కోసం ఉపయోగించాలని ఉందని నేరుగా ఆగాఖాన్‌యే చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే ఆయన తన సంపదలో 12.5 శాతం డబ్బును దాతృత్వ సేవలకు ఉపయోగస్తున్నట్లు వివరించారు.


అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా 15 మిలియన్ల మంది ఇస్మాయిలీ ముస్లింలు ఉండగా.. అందులో 5 లక్షల మంది పాకిస్థాన్‌లో ఉన్నారు. అలాగే భారత్, ఆఫ్రికా, దక్షిణాసియా, మధ్యప్రాచ్యం అంతటా వ్యాపించిన ఇస్మాయిలీ ముస్లింలు.. తమ సంపాదనలో 12.5 శాతం డబ్బుని సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా తమ ఆధ్యాత్మికు గురవు ఆగాఖాన్ చనిపోవడంతో.. వారంతా కన్నీరు పెడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూనే.. ఆయన కుటుంబ సభ్యులు, ఇస్మాయిలీ ముస్లింలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com