టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. కటక్ లోని బారాబతి స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏడో ఓవర్ లో తొలి బంతి వేశాక... స్టేడియంలో ఉన్న ఫ్లడ్ లైట్ టవర్లలో ఓ టవర్ లోని లైట్లు ఆరిపోయాయి. దాంతో, మైదానంలో తగినంత వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. దాదాపు 20 నిమిషాల తర్వాత మైదానం సిబ్బంది ఆ టవర్ ను పునరుద్ధరించడం తో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. స్టేడియంలో లైట్లు ఆరిపోవడంతో ప్రేక్షకులు తమ మొబైల్ ఫోన్ లైట్లు ఆన్ చేశారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. భారీ టార్గెట్ తో బరిలో దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శలకు చెక్ పెడుతూ అర్ధసెంచరీతో అలరించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ 33 బంతుల్లో 53 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో శుభ్ మాన్ గిల్ 22 పరుగులతో ఆడుతున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు. టీమిండియా గెలవాలంటే ఇంకా 40 ఓవర్లలో 228 పరుగులు చేయాలి.
![]() |
![]() |