ఫేమస్ యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. సాధారణ నెటిజన్లతోపాటు రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకి చెందిన ఇద్దరు లాయర్లు ఇతడిపై ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఇటీవల ‘‘ఇండియాస్ గాట్ లాలెంట్ షో’’లో పాల్గొన్న రణ్‌వీర్ అల్లబాడియా తీవ్ర అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ షోకి వచ్చిన ఒక మహిళా కంటెస్టెంట్‌తో..‘‘ మీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం జీవితాంతం చూస్తావా..? లేదా ఒకసారి కలిసి శాశ్వతంగా ఆపేస్తావా..?’’ అంటూ అడిగారు. రణ్‌వీర్ అల్లబాడియా వ్యాఖ్యలకు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రణ్‌వీర్ అల్లాబాడియాపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ.. ఆయనను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయాలని కామెంట్లు పెడుతున్నారు.
ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రణ్‌వీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాను చూడలేదని.. అయితే దాని గురించి సమాచారం అందినట్లు చెప్పారు. ఇది చాలా అసభ్యకరంగా ఉందని, తప్పని తెలిసిందని ఫడ్నవీస్ వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని.. అయితే అది ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరికీ లిమిట్ ఉంటుందని.. ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక రణ్‌వీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలపై ముంబై లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫల్శంకర్, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. ఇండియాస్ గాట్ లాలెంట్ షోలో రణ్‌వీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు మహిళలను అగౌరపరచడమేనని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రణ్‌వీర్ అల్లాబాడియాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే డిమాండ్ చేశారు. ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని మండిపడ్డారు.
‘‘ఇండియాస్ గాట్ లాలెంట్ షో’’లో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రణ్‌వీర్ అల్లాబాడియా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశాడు.
అందులో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని.. అందులో ఎలాంటి కామెడీ లేదని స్పష్టం చేశారు. కామెడీ చేయడం తన బలం కాదని.. ఈ విధంగా తన ఛానల్‌కు ప్రచారం తెచ్చుకోవాలనేది తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను సమర్థించుకోవాలనుకోవడం లేదని చెప్పిన రణ్‌వీర్.. తనను క్షమించండి అని చెప్పారు.
![]() |
![]() |