కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు పరిధిలోని రొయ్యూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నూతన ఇసుక క్వారీ ఏర్పాటుపై పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ కోసం సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆర్డీవో హేలా షారోన్, ఏపీ కాలుష్య నియంత్రణ మడలి ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ ఎం కుసుమకుమారి పొల్గొన్నారు. రొయ్యూరు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 270లో 25 హెక్టార్ల విస్తీర్ణంలో క్వారీ ప్రారంభించి 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిపిపేందుకు సదస్సు ఏర్పాటు చేశామని ఆర్డీవో వివరించారు.
గ్రామంలో అవసరాలకు ప్రజలు ఇసుక తీసుకెళ్లొచ్చని, 12 ఎకరాలు దాటిన క్వారీలో మినీ జేసీబీలు ఉపయోగించే అంశంపై ప్రజలు అభిప్రాయాలను తెలపాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. దీంతో కార్మికులు వేదిక వద్దకు వచ్చి యంత్రాలు వినియోగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని, మీకెంత ఇసుక అవసరమైనా తాము లోడింగ్ చేసి అందిస్తామని, ఇదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. సంతకాలు చేసి అందించాలని, వెంటనే సదస్సు ముగించి వెళ్లి పోయారు. వీఆర్వోలు సీహెచ్ శ్రీనివాసరావు, బసవరావు పాల్గొన్నారు.తోట్లవల్లూరులో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు జరుగనుందని తహసీల్దార్ ఎం.కుసుమకుమారి తెలిపారు.