ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం పోలింగ్ జరగనుంది. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటుగా.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ తరుఫున ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థికి టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకూ పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఐదు జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం 739 మంది అధికారులు, 148 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 295 ఓపీవోలు,148 మంది మైక్రో అబ్జర్వర్లు, 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి గుంటూరు - కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు.. పీడీఎఫ్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కూటమి నుంచి టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో ఉన్నారు. బరిలో 25 మంది వరకూ అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ వీరిద్దరి మధ్యే ఉండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,47,116గా ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన సమయంలో పరిచయాలు ఆలపాటికి అనుకూలంగా ఉన్నాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుసార్లు గెలిచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండటం, అవినీతి ఆరోపణలు లేకపోవడం వంటివి లక్ష్మణరావుకు కలిసివస్తున్నాయి.
ఉమ్మడి ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయానికి వస్తే ప్రస్తుతం ఇళ్ల వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఈసారి పోటీ ప్రధానంగా పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మధ్యన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,14,984గా ఉంది. బలమైన సామాజికవర్గం, కూటమి ఎమ్మెల్యేలు, కార్యకర్తల అండ, సోషల్ మీడియా ప్రచారం పేరాబత్తుల రాజశేఖరంకు కలిసివస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు, సామాజికవర్గం అండ రాఘవులకు సానుకూలంగా కనిపిస్తోంది.
ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే ఏపీటీఎఫ్‌కు చెందిన పాకలపాటి రఘువర్మ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోసారి ఆయన బరిలో ఉన్నారు. గాదె శ్రీనివాసులునాయుడు (పీఆర్‌టీయూ), కోరెడ్ల విజయగౌరి (యూటీఎఫ్) నుంచి పోటీ చేస్తున్నారు. రఘువర్మకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 22,493 ఓట్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa