విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆయన పర్యటనలో ఖలిస్థానీ మద్దతుదారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సెక్యూరిటీని దాటుకుంటూ ఓ దుండగుడు ఏకంగా జైశంకర్ కారుకు అత్యంత సమీపంగా దూసుకొచ్చాడు. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జైశంకర్ బయటకు వస్తున్న సమయంలో కొంతమంది ఖలిస్థానీ మద్దతుదారులు కలకలం సృష్టించారు. నిరసన వ్యక్తం చేస్తుండగా.. ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు వచ్చి ఘోరావ్ చేశాడు. చేతిలో ఉన్న భారత జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించాడు.
దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమికొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల కిందట యూకే పర్యటనకు వెళ్లిన జైశంకర్ మార్చి 9వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. తన పర్యటనలో బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-యూకే వ్యూహాత్మక సహకారం, వాణిజ్యం, విద్య, సాంకేతికత, రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపైచర్చించారు.
ఈ సందర్భంగా చాథమ్ హౌస్ జరిగిన ‘ప్రపంచ వృద్ధి.. భారతదేశ పాత్ర’ అనే అంశంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. చర్చ సందర్భంగా, కశ్మీర్ సమస్య పరిష్కరానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వినియోగించుకుంటారా? అన్న ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ.. మూడో పక్షం జోక్యం అవసరం లేదని ఉద్ఘాటించారు. భారత్ విధానాన్ని జైశంకర్ గట్టిగా సమర్థించారు. కశ్మీర్ వివాదం పరిష్కారానికి ఆర్టికల్ 370 రద్దు, ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి, ఎన్నికల్లో అధిక ఓటింగ్ నమోదు వంటివి నిర్ణయాత్మక చర్యలను భారత్ ఇప్పటికే తీసుకుందని సమాధానం ఇచ్చారు. మేము భారత్ అధీనంలో లేని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తీసుకురావడం గురించి వేచిచూస్తున్నామని తెలిపారు. అదే జరిగితే కశ్మీర్ సమస్య పరిష్కారమైనట్టే అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa