కొంత కాలంగా టీమిండియా అన్ని ఫార్మాట్లలో తన అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్నప్పటికీ.. ఐసీసీ టోర్నీలకు వచ్చే సరికి ఫైనల్లో చేతులెత్తేస్తోంది. లీగ్, నాకౌట్ అన్ని మ్యాచ్‌లు గెలుస్తున్నా తుది మెట్టుపై బోల్తా పడి టైటిల్‌కు దూరమైన టోర్నీలు చాలానే ఉన్నాయి. గతేడాది టీ-20 వరల్డ్ కప్ నెగ్గడమే కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే దాని తర్వాత జరిగిన మరో ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ- 2025లోనూ తనదైన ఆటతీరును ప్రదర్శించిన భారత్.. మళ్లీ ఇక్కడ ఫైనల్స్‌కు చేరుకుంది. ఐసీసీ టోర్నీల్లో నిలకడైన జట్టుగా పేరున్న.. దాదాపు ప్రతి టోర్నీలోనూ సెమీఫైనల్ వరకు చేరుతూ వస్తున్న న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
అయితే.. గతంలో ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు షాక్‌లు తగిలాయి. రెండు ఫైనల్స్‌లో ఓడిపోయింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ సెమీస్‌లో కివీస్.. టీమిండియాకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో అన్ని ఫార్మాట్లలో భారత్ చరిత్ర ఏంటి.. ఎన్ని టైటిల్స్ గెలిచింది. ఎన్నింట్లో ఓడిపోయింది.. వంటి రికార్డుల్ని చూద్దాం.
ఐసీసీ టోర్నీల్లో భారత్ చరిత్ర చూస్తే.. ఇప్పటివరకు 13 టోర్నీల్లో ఫైనల్ వరకు చేరింది. చివరిసారిగా 2024 టీ-20 వరల్డ్‌కప్ జరగ్గా.. సౌతాఫ్రికాపై గెల్చిన రోహిత్ సేన వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. భారత్‌కు ఐసీసీ టోర్నీల్లో 14వ ఫైనల్.
1. మొదటిసారిగా లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్ సారథ్యంలో 1983 వన్డే వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌పై గెల్చిన భారత్.. తొలిసారి ఐసీసీ టైటిల్ దక్కించుకుంది.
2. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీ (ఇప్పటి ఛాంపియన్స్ ట్రోఫీ) ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓటమి పాలైంది.
3. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు. దీంతో టైటిల్ పంచుకున్నారు.
4. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది.
5. 2007లో తొలిసారి జరిగిన టీ-20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ చేరగా.. ఉత్కంఠభరిత పోరులో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్ విజేతగా నిలిచింది.
6. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ధోనీ సారథ్యంలో భారత్ మరోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక్కడ ప్రత్యర్థి శ్రీలంక.
7. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ ఇంగ్లాండ్‌పై భారత్ గెలిచింది. ఇక ఇక్కడినుంచి భారత్‌కు చేదు ఫలితాలే ఎదురయ్యాయి. వరుసగా ఫైనల్స్‌లో ఓడిపోతూ వచ్చింది.
8. 2014 టీ-20 ప్రపంచకప్‌లో శ్రీలంక చేతిలో ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. 2007, 2011 ప్రపంచకప్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్‌పై ఈ ఫైనల్లో స్లోగా ఆడాడని విమర్శలు వచ్చాయి.
9. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫైనల్ చేరిన టీమిండియా.. దాయాది పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది.
10. 2021 లో తొలిసారి జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
11. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సెకండ్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి మరోసారి రన్నరప్‌గానే నిలిచింది.
12. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌లు, క్వార్టర్స్, సెమీస్ గెల్చిన భారత్.. ఫైనల్లో మరోసారి కంగారూలకు తలొంచింది.
13. వరుసగా పలు టోర్నీల్లో ఫైనల్లో ఓడిన టీమిండియా.. ఎట్టకేలకు ఫైనల్ ఫోబియాను వీడి.. జగజ్జేతగా నిలిచింది. 2024 టీ-20 ప్రపంచ కప్‌ను గెలిచి.. ఈ ఫార్మాట్లో వరల్డ్ కప్ రెండోసారి గెల్చుకుంది భారత్. ఇక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ కాగా ప్రత్యర్థి సౌతాఫ్రికా.
ఇలా మొత్తం 13 టోర్నీల్లో ఫైనల్ చేరితే.. దీంట్లో ఏడింట్లో ఓడిపోగా.. ఐదు (1983 వన్డే వరల్డ్‌కప్, 2007 టీ-20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ-20 వరల్డ్‌కప్) గెలిచింది. ఒకటి (2002 ఛాంపియన్స్ ట్రోఫీ) షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే 2013- 2024 మధ్య వరుసగా ఐదు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరినా ఓడిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 ఫైనల్ చేరిన భారత్.. విజేతగా నిలిచి మరో టైటిల్ గెల్చుకోవాలని కోట్లాది భారతీయులు కోరుకుంటున్నారు. ఆదివారం రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు.. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa