ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 10 వేల సిప్‌తో చేతికి రూ. 5 లక్షలు

business |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 11:19 PM

దీర్ఘకాలంలో అద్భుతమైన రిటర్న్స్ కోసం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ రిస్క్ ఉన్నప్పటికీ.. లాంగ్ రన్‌లో చాలా వరకు మెరుగైన రాబడి అందిస్తుంటాయి. ఇంకా.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కొన్నింటి సిప్ రాబడులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక) ద్వారా క్రమంగా పెట్టుబడి పెడుతూ ఉంటే.. ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడుదొడుకులను అధిగమించి, స్థిరమైన రాబడిని పొందగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. మార్కెట్ పెరుగుదల, కంపెనీల పనితీరు, ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ పరిస్థితులు వంటి అంశాలు.. ఈక్విటీ ఫండ్స్ రాబడులపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలికంగా పరిశీలిస్తే, సిప్ పెట్టుబడులు మంచి రాబడిని అందించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


ఈ క్రమంలోనే గత మూడు సంవత్సరాలలో సిప్ పెట్టుబడులపై ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ .. 30 శాతం వరకు రాబడినిచ్చిన టాప్ 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. వాల్యూ రీసెర్చ్ ఈ వివరాల్ని వెల్లడించింది.


 దీంట్లో ముందుగా ఎస్బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫార్మా హెల్త్‌కేర్ అండ్ డయాగ్నస్టిక్స్ ఫండ్ వంటి సెక్టార్ ఫండ్స్ మంచి లాభాలు అందించాయి. ఈ రెండింట్లో సిప్ పెట్టుబడులపై ఎక్స్ఐఆర్ఆర్ 29.24 శాతం, 29.23 శాతం చొప్పున రాబడి వచ్చింది. ఈ క్రమంలోనే రూ. 10 వేల సిప్‌పై చేతికి మూడేళ్లలో రూ. 5.45 లక్షలు వచ్చాయి.


బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడు సంవత్సరాలలో SIP పెట్టుబడులపై 27.98 శాతం ఎక్స్ఐఆర్ఆర్ అందించింది. ఈ పథకంలో నెలకు రూ. 10,000 సిప్ చేసి ఉంటే ఇప్పుడు రూ. 5.36 లక్షలు వచ్చేవి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో సిప్ పెట్టుబడులపై 26.76 శాతం ఎక్స్ఐఆర్ఆర్ ను అందించింది. నెలకు రూ. 10,000 సిప్‌పై ఇప్పుడు రూ. 5.27 లక్షలు వచ్చేవి.


యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్ మూడేళ్లలో 26.63 శాతం ఎక్స్ఐఆర్ఆర్ అందించింది. నెలకు రూ. 10,000 సిప్‌పై ఇప్పుడు రూ. 5.26 లక్షలు వచ్చేవి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, హెచ్డీఎఫ్సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే రెండు ఇన్‌ఫ్రా సెక్టార్ ఫండ్స్ వరుసగా 26.09 శాతం, 25.96 శాతం ఎక్స్ఐఆర్ఆర్ అందించాయి. ఈ పథకాల్లో నెలకు రూ. 10,000 పొదుపు చేసిన వారికి.. వరుసగా రూ. 5.22 లక్షలు, రూ. 5.21 లక్షలు అందాయి.


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్ .... సీప్ పెట్టుబడులపై మూడేళ్లలో 25.76 శాతం ఎక్స్ఐఆర్ఆర్ అందించింది. ప్రతి నెలా ఇక్కడ రూ. 10 వేల చొప్పున మదుపు చేసిన వారికి రూ. 5.20 లక్షలు వచ్చాయి. ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్.. నెలకు రూ. 10 వేల సిప్‌పై రూ. 5.19 లక్షలు అందించింది. డీఎస్పీ హెల్త్‌కేర్ ఫండ్ సిప్ పెట్టుబడులపై 25.11 శాతం ఎక్స్ఐఆర్ఆర్ అందించింది. ఇక్కడ 10 వేల సిప్‌ను రూ. 5.15 లక్షలు చేసింది. చివరగా వీటిని పాస్ట్ రిటర్న్స్ ఆధారంగా ఎంచుకోవద్దు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com