జనాల బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా దందాకు తెరతీశారు. అందినకాడికి దోచుకునేందుకు పన్నాగం పన్నుతున్న ఈ కేటుగాళ్లు, తాజాగా కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడిని బెదిరించి డబ్బులు గుంజాలని ప్రయత్నించారు. సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేర్లను వాడుకుంటూ కుట్ర పన్నిన సైబర్ క్రిమినల్స్ ఏకంగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరును కూడా ప్రస్తావించడం సంచలనంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్‌కు చెందిన చిలువేరు శ్రీకాంత్ అనే యువకుడు.. కరీంనగర్‌లో సింగర్‌గా, ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా కొనసాగుతున్నాడు. కాగా.. శ్రీకాంత్‌కు ఈరోజు (ఏప్రిల్ 20) మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్‌లో అవతలి వ్యక్తి శ్రీకాంత్‌ను ఉద్దేశించి, తాను మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడని, వారు చెప్పినట్లు వినకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరించాడు.
సైబర్ నేరగాళ్లు శ్రీకాంత్ ఆధార్ కార్డు నెంబర్‌ను ఉపయోగించి సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేర్లతో నకిలీ లేఖలు సృష్టించారు. అంతేకాకుండా, మహారాష్ట్ర పోలీస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరుతో కూడా ఓ లేఖను పంపించారు. ఆ తర్వాత దాదాపు రెండు గంటలపాటు శ్రీకాంత్‌కు తరచూ వీడియో కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. చివరికి డబ్బులు ఇస్తే వదిలేస్తామని ఆ సైబర్ కేటుగాళ్లు డిమాండ్ చేశారు.
తన వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యాయని గ్రహించిన శ్రీకాంత్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. సైబర్ అరెస్టు పేరుతో బెదిరించి లక్షలు కాజేయాలని ప్లాన్ వేసిన సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం ఇలాంటి డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. సామాన్యులను భయపెడుతూ అందినకాడికి దోచేసుకుంటున్నారు. అయితే.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం వెనక్కి తగ్గకుండా తమ పంజా విసురుతూనే ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa