రాష్ట్రాభివృద్ధికి తోడుగా ఉండాలని ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా విన్నవించారు. వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి తోడ్పాటు అందించాలని కోరారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మంత్రి లోకేశ్ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో ఢిల్లీలోని మోదీ నివాసానికి వెళ్లిన లోకేశ్ కుటుంబం దాదాపు 2 గంటలు ప్రధానితో గడిపింది. మోదీకి లోకేశ్ శాలువా కప్పి, తిరుమల శ్రీవారి విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. లోకేశ్ నుంచి మొదటి ప్రతిని అందుకున్నారు. మరో పుస్తకంపై మోదీ సంతకం చేసి లోకేశ్‌కు అందించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేశ్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్‌లో పొందుపరిచారు. తన నివాసంలో బ్రాహ్మణి, దేవాన్ష్‌లకు ప్రధాని మోదీ ఆశీస్సులు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa