ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరీ జగన్నాథ ఆలయంలో ఘోర అపచారం.. డైనింగ్ టేబుల్‌పై మహాప్రసాదం

national |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 07:53 PM

ప్రముఖ శ్రీక్షేత్రం ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో జరిగే రథయాత్ర ప్రపంచ గుర్తింపు పొందింది. ఏటా ఆషాడ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఎంతో విశిష్టత కలిగిన జగన్నాథుడి ఆలయంలో అపచారం జరిగింది. స్వామివారికి నివేదించిన మహాప్రసాదాన్ని డైనింగ్ టేబుల్‌పై కూర్చుని ఓ కుటుంబం తింటున్న వీడియో వివాదానికి దారితీసింది. 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయంలో నైవేద్యంగా సమర్పించే మహాప్రసాదాన్ని భక్తులు నేలపై కూర్చుని తినే పరంపరగా ఇక్కడ కొనసాగుతోంది. ఈ వీడియోలో చిన్నారుల సహా కనీసం 10 మంది కుటుంబ సభ్యులు.. పూరీలోని ఓ బీచ్ రిసార్టులో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తింటుండగా.. ఓ పూజారి వారికి మహాప్రసాదాన్ని పంచుతున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆలయంలో ఏ చిన్న పొరపాటు సంఘటన జరిగినా భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతారు.


వీడియోలో ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ కుటుంబాన్ని ప్రశ్నించాడు... దీనికి ఆ కుటుంబానికి చెందిన మహిళ సమాధానం ఇస్తూ.. ‘మేము ముందుగా అనుమతి అడిగిన తర్వాతే టేబుల్ వద్ద తినాలనుకున్నాం’” అని చెప్పింది. ఆపై ఆ వ్యక్తి పూజారిని ప్రశ్నిస్తూ,‘ఇది ఎలా అనుమతించారు’" అని నిలదీశాడు.


వీడియో వైరల్ కావడంతో, భక్తులు ఆవేదన వ్యక్తచేయడంతో ఆలయ అధికారులు స్పందించారు. శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్  ఓ ప్రకటన విడుదల చేస్తూ.. టైనింగ్ టేబుల్‌పై మహాప్రసాదాన్ని తినడం సంప్రదాయ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘స్వామివారి మహాప్రసాదం పరబ్రహ్మ స్వరూపంలో పూజించబడుతుంది... దీనిని భూమిపై కూర్చుని భక్తిశ్రద్ధలతో సేవించాలి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కాబట్టి భక్తులు దయచేసి సంప్రదాయ విరుద్ధమైన చర్యలైన టేబుల్ వద్ద తినడం వంటి వాటిని నివారించాలి’ అని పేర్కొన్నారు.


స్థానికుల భావోద్వేగాలు, మత విశ్వాసాలను గౌరవిస్తూ.. పూరీ నగరంలోని హోటల్స్‌ కూడా తమ అతిథులను ఇలాంటి చర్యల గురించి ముందుగా హెచ్చరించాల్సిందిగా ఆలయ అధికారులు కోరారు. పూరీ ఆలయంలో రోజూ స్వామివారికి 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల పూరీ ఆలయంలోనే ఉంది. శ్రీమన్నారాయణుడి దేవేరి, సంపదలకు అధిదేవత అయిన శ్రీలక్ష్మీ ఈ పంట శాలను స్వయంగా పర్యవేక్షిస్తారని పురాణ ప్రాశస్త్యం. ఇక్కడ తయారుచేసిన నైవేద్యాలను స్వామికి సమర్పించిన తర్వాత భక్తులకు వడ్డిస్తారు. అంతేకాదు, చుట్టుపక్కల పేదలకు కూడా దీనిని పంచిపెడతారు. పూరీలో ఉండేవారికి మరణానికి ముందే మోక్షం లభిస్తుందని చెబుతారు.


ఇక, పూరీలో ఏ హిందూ ఆలయంలో లేనివిధంగా గర్బగుడి నుంచి విగ్రహాలను రథంపై ఊరేగిస్తారు. స్వామి వారి యాత్ర కోసం ఏటా కొత్తగా రథాన్ని నిర్మాణిస్తారు. ఈ పనులు యాత్రకు కొన్ని నెలల కిందటే ప్రారంభమవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa