ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి లోకేశ్‌ సమక్షంలో సైయెంట్, ఏఐసీటీఈతో ఏపీఎస్ఎస్ డీసీ అవగాహన ఒప్పందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 11, 2025, 06:04 PM

యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ సైయెంట్(Cyient), ఏఐసీటీఈ (అఖిల భారత సాంకేతిక విద్యామండలి)తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇది త్రైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా ప్రధానంగా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ సహకారం అందించనున్నాయి. మొదటగా విశాఖ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థల్లో వ్యాపార దృక్పథం, మేథోసంపత్తి సృష్టితో పాటు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు, సంస్థలలో నైపుణ్యాలు, సామర్థ్య పెంపునకు కృషిచేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడుదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు.  ఐ-కేర్, ఐ-కేఫ్ సెంటర్స్ ఏర్పాటు ఈ ఒప్పందంలో భాగంగా i-CARE (Innovation Creation and Research for Entrepreneurship), i-CAFE(Idea Creation and Auxiliary Facilities for Entrepreneurship) కేంద్రాలను స్థాపించడంతో పాటు ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మేథోసంపత్తి హక్కులు, సాంకేతిక బదలాయింపు కేంద్రాలు(IPR-TT Cells) ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలోని విద్యాసంస్థలపై దృష్టిసారించనున్నారు. బూట్ క్యాంప్స్, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఫెయిర్స్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. క్లస్టర్ స్థాయి కాంక్లేవులు, పరిశ్రమ నిపుణులతో మార్గనిర్దేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కోసం శిక్షణ, సామర్థ్యం పెంపునకు కృషిచేయనున్నారు. వివిధ రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం కోసం నోడల్ ఆఫీస్ గా ఏపీఎస్ఎస్ డీసీ వ్యవహరించనుంది.ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ, సీఈఓ జి.గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే.రఘు, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, సైయెంట్ సంస్థ ఫౌండర్ ఛైర్మన్, బోర్డు మెంబర్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్, కేంద్ర విద్యాశాఖ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ అభయ్ జేరే, సైయెంట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, కార్పొరేట్ ఫంక్షన్స్ హెడ్ డాక్టర్ పీఎన్ఎస్వీ నరసింహం, ఏఐసీటీఈ, కేంద్ర విద్యాశాఖ ఇన్నోవేషన్ సెల్ అసిస్టెంట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ దీపన్ సాహూ, బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సీఈఓ డాక్టర్ సుధాకర్ పి. ఏపీ విట్ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ ఎస్.వి కోటా రెడ్డి, సైయెంట్ లిమిటెడ్ సీఎస్ఆర్ ప్రోగ్రామ్స్ సీనియర్ డైరెక్టర్ కృష్ణ మోహన్ దీవి తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa