రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రశంసించింది. విజయవాడలో ఈరోజు జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిక్కీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.సమావేశంలో ఫిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, తీసుకుంటున్న చర్యలు పరిశ్రమల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని కొనియాడారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చూపుతున్న చొరవను వారు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న "స్వర్ణాంధ్ర విజన్ 2047" లక్ష్యాలను సాకారం చేసేందుకు తమవంతు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రపంచీకరణకు పచ్చజెండా ఊపడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని తెలిపారు. పీవీ నరసింహారావు ఆ నిర్ణయం కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారని కొందరు చెబుతున్నప్పటికీ, ఆ చర్య దేశానికి ఎంతో మేలు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, మనం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ వంటి ఆధునిక సాంకేతికతల గురించి మాట్లాడుకుంటున్నామని ఆయన అన్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఫిక్కీ వంటి సంస్థలు దేశ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు అనేకసార్లు దావోస్ వంటి ప్రపంచ ఆర్థిక సదస్సులకు హాజరయ్యానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. "ఒకప్పుడు వ్యాపారవేత్తలతో రాజకీయ నాయకులు పెద్దగా మాట్లాడేవారు కాదు. దావోస్ వెళ్తామంటే, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని వద్దని సలహా ఇచ్చేవారు. అయినా నేను వెళ్ళాను, పారిశ్రామికవేత్తలతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించాను" అని ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక ప్రగతి కీలకమని, ఆ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa