ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొదుపు, మదుపు గురించి వారెన్ బఫెట్ చెప్పిన ఆర్థిక సూత్రాలివే

business |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 11:22 PM

డబ్బు సంపాదించడం ఒకెత్తయితే.. దాన్ని తెలివిగా ఖర్చు చేయడం మరో ఎత్తు. ప్రస్తుత యువతలో చాలామందికి ఆర్థిక క్రమశిక్షణ కొరవడుతోందని పెద్దలు తరచూ చెబుతుంటారు. లక్షల్లో జీతం వస్తోంది కదా అని ఖరీదైన కార్లు, బైకులు కొనేస్తుంటారు. సోషల్ మీడియాలో తమ ఆడంబరాల్ని ప్రదర్శిస్తుంటారు. వచ్చే జీతంతో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డుతో ఇష్టానుసారం ఖర్చు చేసేస్తుంటారు. అలాంటి వారికి ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు.. వారెన్ బఫెట్ మాటలు కచ్చితంగా కనువిప్పు కలిగిస్తాయని చెప్పొచ్చు. పొదుపు, పెట్టుబడులపై ఆయన చెప్పిన సూత్రాలు ఆచరణీయం. డబ్బు ఎక్కడ వృథా చేయకూడదో తెలిసిన వాడే దాన్ని కాపాడగలడని ఆయన బలంగా నమ్ముతారు. మరి, డబ్బు ఖర్చు గురించి, అలాగే ఆయన చెప్పిన 5 మదుపు సూత్రాలేంటో ఒకసారి చూద్దాం.


ప్రతిఒక్కరికీ సొంతిల్లు ఒక ఎమోషన్. సొంతింట్లో నివసించడంలో ఉండే సంతృప్తే వేరు. డబ్బులున్నాయి కదా అని 2 BHK కొనుగోలు చేయాల్సినచోట 4 బీహెచ్‌కే తీసుకోవడం అర్థం లేనిదంటారు బఫెట్. ఆయన స్వయంగా 1958లో కొనుగోలు చేసిన సాధారణ ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తున్నారు. మన అవసరానికి మించి ఇంటిని కొనుగోలు చేస్తే.. దానికి మెయింటెనెన్స్, ట్యాక్సులు, ఈఎంఐ ఇలా పెద్ద మొత్తంలో ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇల్లు మనం ఉండడానికే తప్ప.. షోఆఫ్ కోసం కాదనేది ఆయన సూచన.


క్రెడిట్ కార్డు- రెండు వైపులా పదునున్న కత్తి..


క్రెడిట్ కార్డు రెండువైపులా పదును కలిగిన కత్తి లాంటిది. దీన్ని ఎంత తెలివిగా వాడుకుంటే అంత మేలు. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి దారి తీస్తుందని వారెన్ బఫెట్ హెచ్చరిస్తారు. సౌలభ్యం కోసం క్రెడిట్ కార్డు వాడడం వరకు ఓకే గానీ, దాని ద్వారా అధికంగా ఖర్చు చేయడాన్ని అలవాటుగా మార్చుకోవద్దంటారు. ఒకవేళ మీరు కేవలం మినిమమ్ బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తూ వెళ్తే వడ్డీల భారంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోతారని, బయటకు రావడం చాలా కష్టమవుతుందని బఫెట్ స్పష్టం చేస్తారు.


కారు- విలువ తగ్గే ఆస్తి..


రయ్ రయ్మంటూ సొంత కారులో దూసుకెళ్లాలని చాలామందికి ఉంటుంది. జీతం పెరిగిందనో, స్థోమత ఉందనో.. వెంటనే కారు కొనుగోలు చేస్తుంటారు. చేతిలో తగిన మొత్తం లేకపోయినా EMI కట్టడానికీ సిద్ధమవుతుంటారు. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదేనంటారు బఫెట్. షోరూమ్ నుంచి కారు బయటకు రాగానే దాని విలువ తగ్గిపోతుందని, కేవలం ఐదేళ్లలోనే దాని విలువ సుమారు 60 శాతం మేర పడిపోతుందని చెబుతారు. మన పెట్టుబడులు ఎప్పుడూ వాటి విలువ పెంచే వాటిలో ఉండాలే తప్ప.. తగ్గించే వాటిలో కాదంటారు. మరి బఫెట్ అసలు కారే వాడరా? అన్న ప్రశ్న వస్తుంది. ఆయన కారు వాడుతుంటారు. అయితే, 2014లో కొనుగోలు చేసిన క్యాడిలాక్ ఎక్స్‌టీఎస్‌ని వినియోగిస్తున్నారు. అదీ జనరల్ మోటార్ నుంచి డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయడం విశేషం.


లాటరీ వద్దే వద్దు..


లాటరీలో అంత గెలిచారు.. ఆన్‌లైన్‌లో జూదమాడి ఇంత గెలిచారని వినడానికి బానే ఉన్నా.. లక్ ఆధారంగా నడిచే ఇలాంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదంటారు బఫెట్. జాక్‌పాట్ తగిలితే ఒక్క దెబ్బకు లక్షాధికారి అయిపోవచ్చని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి ఆ అదృష్టం దక్కేది కేవలం 10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమేనన్నది ఎవరూ గమనించరని చెప్తారు. కొన్నిసార్లు జూదంలో డబ్బులు వచ్చినట్లు అనిపించినా ఒకసారి ఆ చట్రంలో ఇరుక్కుంటే పోగొట్టుకోవడం తప్ప వచ్చేది ఉండదనేది ఆయన మాట.


తెలియని వాటిలో పెట్టుబడులు వద్దు!


బంధువులు చెప్పారనో, స్నేహితుడు సూచించాడనో తెలియని పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు కొందరు. ఆ పథకం గురించి సొంతంగా అధ్యయనం చేయరు. మీరు పెట్టుబడి చేస్తున్న పథకం అసలు మీకు అర్థమే కాకపోతే మీ డబ్బును రిస్క్‌లో పెడుతున్నట్లు అర్థం అంటారు బఫెట్. మరీ ముఖ్యంగా అధిక ప్రతిఫలం, ఎక్కువ లాభం వంటి పదాలు వినడానికి బాగానే ఉన్నా.. వాటిలో అంతే స్థాయిలో రిస్క్ దాగి ఉందనేది గమనించండి. కాబట్టి అలాంటి వాటి జోలికెళ్లొద్దంటారు బఫెట్.


మీరు సంపాదించిన దాంట్లో ఖర్చు చేయగా మిగిలినది పొదుపు చేయడం కాకుండా.. పొదుపు చేయగా మిగిలినది ఖర్చు చేయాలి అనేది బఫెట్ చెప్పే కీలక సూత్రం. అంతేకాదు.. మీ అవసరాల కోసం ఖర్చులు చేయడం వరకు ఓకే.. కానీ, ఆడంబరాల జోలికెళ్లొద్దనేది యువతకు బఫెట్ ఇచ్చే విలువైన సలహా. ఈ సూత్రాలను పాటిస్తే ఆర్థికంగా స్థిరపడడం కష్టం కాదని ఆయన మాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa