ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీఆర్ గడువు ముగిసినా టీడీఎస్ రీఫండ్.. కొత్త ఐటీ బిల్లుపై కమిటీ నివేదిక

business |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 11:49 PM

 కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 2025 బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ కీలక సూచనలు చేసింది. లాభాపేక్షలేని సంస్థలకు వచ్చే విరాళాలపై పన్ను మినహాయింపులు కొనసాగించాలని సూచించింది. అలాగే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ రీఫండ్ల కోసం ఐటీ రిటర్నుల గడువు దాటినప్పటికీ ఎలాంటి పెనాల్టీ లేకుండా అనుమతించాలని సిఫారసు చేసింది. ఇది అమలైతే చాలా మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఈ మేరకు బీజేపీ నేత బైజయంత్ పండా నేతృత్వంలో 31 మందితో ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ నివేదికను లోక్‌సభకు సమర్పించింది. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని ఈ కొత్త బిల్లు భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 566 సిఫార్సులతో కూడిన 4,575 పేజీల నివేదికను సెలెక్ట్ కమిటీ లోక్‌సభలో ప్రవేశపెట్టింది.


ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 115బీబీసీ ప్రకారం మతపరమైన, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించే ట్రస్టులకు అనామక విరాళాలపై ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నారు. కొత్త బిల్లులో ఈ మినహాయింపులు మతపరమైన ట్రస్టులకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో హాస్పిటల్స్, విద్యా సంస్థలు నిర్వహించే మత దాతృత్వ ట్రస్టులకు వచ్చే విరాళాలపై 30 శాతం ట్యాక్స్ ప్రతిపాదించారు. ఈ కొత్త మార్పులు తీసుకురావడం వల్ల ఆయా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందని సెలెక్ట్ కమిటీ పేర్కొంది. కొత్త చట్టంలోనూ మినహాయింపులు కల్పించాలని సూచించింది.


టీడీఎస్ రీఫండ్ల కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి చేసే నిబంధనను పూర్తిగా తొలగించాలని సెలెక్ట్ కమిటీ సూచించింది. గడువు దాటిన తర్వాత సైతం రీఫండ్లు అనుమతించాలని తెలిపింది. రీఫండ్లు క్లెయిమ్ చేసేందుకు రిటర్నులు ఫైల్ చేయాలనే నిబంధన కొన్నిసార్లు ప్రాసిక్యూషన్‌కు దారి తీసే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది. ట్యాక్స్ పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేకపోయినా టీడీఎస్ కోత ఎదుర్కొనే చిన్న పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలని సూచించింది. కొత్త చట్టంలో ప్రీవియస్, అసెస్మెంట్ ఇయర్ స్థానంలో ట్యాక్స్ ఇయర్ తేవడం సరైనదిగా పేర్కొంది. కొత్త బిల్లులో 32 సిఫారసులు చేసింది.


గత ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు గడువు సెప్టెంబర్ 15, 2025 వరకు ఉంది. ఇప్పటికే కోటిన్నర మందికిపైగా ఐటీ రిటర్నులు ఫైల్ చేసినట్లు సమాచారం. గడువు సమీపిస్తున్న క్రమంలో ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది కంటే ఈసారి మరింత ఎక్కువ మంది రిటర్నులు ఫైల్ చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa