ఘరానా మోసానికి తెరతీసిన ఓ కేటుగాడి గుట్టురట్టు చేశారు ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఓ వ్యక్తి నకిలీ ఎంబసీని ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు. అసలు లేని దేశానికి ఎంబసీ పెట్టి, ఖరీదైన కార్లకు స్టిక్కర్లు వేసి, దౌత్య పాస్‌పోర్టులు సృష్టించి మోసాలకు తెరతీశాడు. ప్రముఖ నేతలతో పరిచయం ఉన్నట్ుట నకిలీ ఫోటోలను చూపిస్తూ పలువుర్ని నమ్మించాడు. అయితే, అతడి పాపం పండి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘాజియాబాద్‌లో ఈ మోసం వెలుగు చూసింది.
నిందితుడు హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానిని " వెస్ట్‌ఆర్కిటికా " పేరుతో ఎంబసీగా మార్చేశాడు. వెస్ట్ ఆర్కిటికా అనేది అంటార్కిటికాలోని ఒక ప్రాంతం. ఒకప్పుడు యూఎస్ నౌకాదళ అధికారి దీనిని దేశంగా ప్రకటించుకున్నాడు. కానీ దీనికి ఎటువంటి గుర్తింపు లేదు. జైన్ దీని పేరుతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మందిని నమ్మించాడు. అంతేకాదు మనీలాండరింగ్ కూడా చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అభియోగాలు మోపారు.
యువతను నమ్మించేందుకు జైన్ చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫోటోలను చూపించాడు. గతంలో 2011లో కూడా శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నాడని అతనిపై కేసు నమోదయింది. ఇటీవల ఎంబసీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని నకిలీ ఎంబసీ గుట్టు రట్టు చేశారు. వెస్ట్ ఆర్కిటికాతో పాటు 12 ఇతర దేశాల దౌత్య పాస్‌పోర్టులు, విదేశాంగ శాఖ స్టాంపులు ఉన్న పేపర్లు, 34 దేశాల స్టాంపులు, రూ.44 లక్షల డబ్బు, దౌత్య నంబర్‌ప్లేట్లు, ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలు వెస్ట్ ఆర్కిటికా అనే దేశం ఉందా?
2001లో అమెరికా నేవీ అధికారి ట్రావిస్ మెక్‌హెన్రీ వెస్ ఆర్కిటికాను దేశంగా ప్రకటించాడు. తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అంటార్కిటికాలో 6,20,000 చదరపు మైళ్ల మేర తనదే అని చెప్పాడు. ఆ దేశానికి 2,536 మంది పౌరులు ఉన్నారని చెబుతున్నా అక్కడ ఎవరూ నివసించరు. అంటార్కిటిక్ ఒప్పందంలోని కొన్ని లొసుగులను ఉపయోగించుకొని మెక్‌హెన్రీ తనను తాను పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం అంటార్కిటికాను శాంతియుత పనులకు, పరిశోధనలకు మాత్రమే ఉపయోగించాలి. మిలిటరీ కార్యక్రమాలు, అణ్వాయుధాలు, వ్యర్థాలు పడేయడానికి ఉపయోగించకూడదు. ప్రైవేటు వ్యక్తులకు ఈ నిబంధనలు వర్తించవు. ట్రావిస్ ఈ విషయాన్ని ఆసరాగా చేసుకున్నాడు.
జైన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను ఆ దేశానికి చెందిన సంపన్నుడినని చెప్పుకున్నాడు. 2017 నుంచి దౌత్య కార్యాలయం నడుపుతున్నట్లు తెలిపాడు. అయితే ఆర్కిటిక్ ఉత్తర ధ్రువంలో ఉండగా అంటార్కిటికాలో ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. "జేమ్స్ బాండ్ లా ఉండాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు" అని పోలీసులు తెలిపారు. అంటే జైన్ ఒక సినిమా హీరోలా గొప్పగా ఉండాలని చూసి చివరికి దొరికిపోయాడని పోలీసులు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa