మరో రెండు మూడు నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. అక్కడ ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న విపక్షాలు... కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఓటర్ల జాబితా సవరించాల్సిన అవసరం ఏమొచ్చిందని? ఇదంతా బీజేపీ ఆడుతోన్న డ్రామా అంటూ మండిపడుతున్నాయి. తాజాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రంలో అధికార బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బీజేపీ ఆదేశాల ప్రకారమే నడుస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం వ్యర్థమని అన్నారు.
తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘నకిలీ ఓటర్ల జాబితాల ఆధారంగా అధికారాన్ని కొనసాగించాలనుకుంటే, ఎన్నికల అవసరం ఏముంది? నేరుగా బీజేపీ ప్రభుత్వాన్ని పొడిగించండి’’ అని తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల బహిష్కరణపై మీడియా ప్రశ్నకు తేజస్వీ స్పందిస్తూ.. ‘‘బహిష్కరణ ఓ ఎంపికే. కానీ, మేము మిత్రపక్షాలతో, ప్రజలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలు మహాకూటమిలోని పార్టీల మధ్య చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు నిరాకరించడంతో ప్రతిపక్షాలు సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశం పూర్తిగా ఎన్నికల సంఘ పరిధిలోదని, తాము స్పందించలేమని చెప్పినట్లు సమాచారం.
అటు, బిహార్ అసెంబ్లీలో కూడా ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఆర్జేడీతో పాటు ఇతర ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో చర్చ కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు... ‘ఇంతకు ముందు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకొనేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్ని ఎన్నుకుంటోంది’ అంటూ, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ మోసపూరిత చర్యగా అభివర్ణించారు. అయితే, ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన ప్రకారం.. ఇప్పటివరకు 56 లక్షల నకిలీ ఓటర్లను తొలిగించారు. వీరిలో 20 లక్షల మంది చనిపోయినవారు, 28 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు, 7 లక్షల మంది చాలా చోట్ల ఓటర్లుగా నమోదుకాగా.. 1 లక్ష మందిని గుర్తించలేకపోయినట్టు వివరించారు. ఆగస్ట్ 1న ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని, అవసరమైతే మార్పులకు అవకాశం ఉంటుందని ఈసీ తెలిపింది. ఈ ప్రక్రియను రాజ్యాంగబద్ధ చర్యగా పేర్కొంటూ సుప్రీంకోర్టులో సైతం నిబంధనల ప్రకారమే జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa