ట్రంప్ టారిఫ్‌లపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ స్నేహం అవసరమని రిపబ్లికన్ పార్టీ నాయకురాలు వ్యాఖ్యానించారు. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనలను న్యూఢిల్లీ సీరియస్‌గా తీసుకోవాలని ఆమె సూచించారు. ఇటీవల న్యూస్‌వీక్‌కు రాసిన వ్యాసంలో ట్రంప్ టారిఫ్‌లపై తన అభిప్రాయం వ్యక్తం చేసిన ఆమె.. ‘అమెరికాకు భారత్ స్నేహం అవసరం.. న్యూఢిల్లీని ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలి’ అని ఆమె కోరారు.
అయితే, భారత్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిని, సుంకాలను తప్పుబడుతుండటంతో సొంత పార్టీలోని నేతల నుంచి నిక్కీ హేలీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాసిన ఒపీనియన్‌లో హేలీ స్వరం మార్చారు. భారత్ కూడా అమెరికా ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని అందులో హెచ్చరించడం గమనార్హం. ‘రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ ఆందోళనను భారత్ పరిగణనలోకి తీసుకుని, పరిష్కారం కోసం వైట్‌హౌస్‌తో కలిసి పనిచేయాలి.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య దశాబ్దాల స్నేహం, సద్భావన ప్రస్తుత ప్రతిష్టంభనను అధిగమించడానికి బలమైన ఆధారాన్ని అందిస్తాయి.. రష్యా ఆయిల్ దిగుమతులు, వాణిజ్య ఒప్పందం వంటి అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. కానీ, మన ఉమ్మడి లక్ష్యం ముఖ్యమైందనే విషయాన్ని మరిచిపోకూడదు’ అని భారత సంతతి రిపబ్లికన్ నాయకురాలు సూచించారు.
గత మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తోన్న యుద్ధానికి నిధుల సేకరణకు సహాయపడేలా మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోళ్లను ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడం ‘సరైంది’ అని నిక్కీ హేలీ అనడం గమనార్హం. కానీ భారత్ ప్రత్యర్థి కాదు, అమెరికా తన కీలకమైన సప్లయ్ ఛైన్‌ను చైనాకు ప్రత్యామ్నాయంగా సహాయం చేయడంలో న్యూఢిల్లీ చాలా అవసరమని ఆమె అన్నారు.
‘భారత్ ప్రాముఖ్యత మరింత లోతైంది.. ప్రపంచ జనాభాలో ఆరో వంతు భారత్‌లోనే ఉన్నారు.. 2023లో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను భారత్ అధిగమించింది.. చైనాతో పోల్చితే అక్కడ యువశక్తికి కొదువలేదు.. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి.. త్వరలోనే ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌ను న్యూఢిల్లీ అధిగమించనుంది.. భారతదేశ వృద్ధి వల్ల స్వేచ్ఛా ప్రపంచానికి ఎలాంటి ముప్పు ఉండదు.. భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను అమెరికా తక్షణమే పునరుద్దరించాలి’ నిక్కీ హేలీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa