ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనాథాశ్రమంలో పెరిగి డెలివరీ బాయ్‌గా పనిచేసి,,,,సివిల్స్ రాయకుండానే ఐఏఎస్‌

national |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 08:30 PM

మన దేశంలో చాలా మందికి ఐఏఎస్, ఐపీఎస్ కావాలనే కల ఉంటుంది. అందుకోసం ఏళ్ల తరబడి కోచింగ్‌లు, ఎగ్జామ్స్ అంటూ.. పుస్తకాల పురుగులాగా మారిపోతూ ఉంటారు. ఇక ఈ సివిల్స్‌లో సత్తా చాటాలంటే.. చదువు, కఠోర శ్రమ, ఖరీదైన కోచింగ్ సెంటర్లు మాత్రమే కాకుండా.. ఆత్మ విశ్వాసం, పోరాట పటిమ, పట్టుదల ముఖ్యం. ఇక అత్యంత సామాన్యులు, బాల్యంలో చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడినవారు కూడా.. సివిల్ సర్వెంట్లు అయిన సంఘటనలను మనం ఇప్పటికే ఎన్నో చూశాం. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన '12th Fail' సినిమాలో చూపించినట్లు.. సివిల్స్ పరీక్షలు నెగ్గేందుకు ఆపసోపాలు పడాల్సిందే. అయితే ఇప్పుడు కలెక్టర్ కుర్చీలో కూర్చున్న ఓ వ్యక్తి.. అలాంటి అడ్డంకులన్నీ దాటుకుని.. ఆ ఉద్యోగంలో చేరారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ పరీక్షలు రాయకుండానే ఆయన.. కలెక్టర్ అయ్యారు. ఆయనే ప్రస్తుతం కేరళలోని పథనంథిట్ట జిల్లా కలెక్టర్ బి.అబ్దుల్ నాజర్.


కేరళ కన్నూర్ జిల్లాలోని తాలస్సేరీ గ్రామానికి చెందిన అబ్దుల్ నాజర్‌ వయసు 5 ఏళ్లు ఉన్నపుడు ఆయన తండ్రి.. ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత.. ఆయన తల్లి తీసుకున్నారు. అబ్దుల్ నాజర్‌తోపాటు అతని సోదరులను పోషించేందుకు.. వారి తల్లి ఇళ్లలో పనిమనిషిగా పనిచేసేవారు. అయినప్పటికీ ఆమె సంపాదన.. వారిని పోషించేందుకు సరిపోయేది కాదు. దీంతో అబ్దుల్ నాజర్, ఆయన సోదరులను.. అనాథాశ్రమంలో చేర్పించారు. వారు అక్కడే 13 ఏళ్ల పాటు ఉంటూ.. చదువుకున్నారు.


అయితే తల్లికి చేదోడు వాదోడుగా ఉండేందుకు.. చిన్నతనం నుంచి అబ్దుల్ నాజర్ కుటుంబం కోసం పనిచేయడం ప్రారంభించారు. బాల్యంలో తనతోటి వారంతా ఆడుకుంటుండగా.. అబ్దుల్ నాజర్ మాత్రం కుటుంబం కోసం పని చేసేవారు. 10 ఏళ్ల వయసులోనే ఇళ్లు శుభ్రం చేయడం, డెలివరీ బాయ్‌గా పనిచేయడం వంటి పనులను చేశారు. పేదరికం కారణంగా ఆయన అనాథాశ్రమంలో ఉంటూ చదువుతోపాటు పని చేస్తున్నప్పటికీ.. అబ్దుల్ నాజర్ మాత్రం తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం వీడలేదు. ఒక పక్క స్కూల్‌కు వెళ్లి చదువుకుంటూనే.. ఉదయాన్నే న్యూస్ పేపర్లు వేయడం, తన కంటే తక్కువ తరగతుల వారికి ట్యూషన్లు చెప్పడం, ఫోన్ ఆపరేటర్‌గా పనిచేయడం వంటివి చేసేవారు. వీటితో వచ్చిన డబ్బులను చదువుతోపాటు ఇంటి ఖర్చుల కోసం ఉపయోగించుకునేవారు.


ఈ క్రమంలోనే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్స్ పరీక్ష రాసిన అబ్దుల్ నాజర్ అందులో ఉద్యోగం సాధించారు. మొట్టమొదట ఆరోగ్య శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. తన ఆర్థిక పరిస్థితి, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి.. ఆయనకు తగిన వనరులు లేవు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. వచ్చిన అవకాశాన్నే రెండు చేతులా ఒడిసిపట్టుకున్నారు. తన వద్ద ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూనే.. తన లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక తనకు వచ్చిన ఉద్యోగంలోనే అత్యుత్తమంగా రాణించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డిపార్ట్‌మెంటర్ ఎగ్జామ్స్‌లో సత్తా చాటాలని టార్గెట్ పెట్టుకున్నారు.


ఆరోగ్య శాఖలో ఉద్యోగాన్ని మొదలుపెట్టిన అబ్దుల్ నాజర్.. కష్టపడే తత్వం, అంకితభావంతో ఒక్కో మెట్టు ఎదిగారు. విధి నిర్వహణలో అబ్దుల్ నాజర్ చూపించే నిజాయితీ, కష్టపడేతత్వం.. చివరికి ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారిక హోదాను కల్పించేలా చేసింది. ఎట్టకేలకు పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌గా అబ్దుల్ నాజర్‌ను నియమించారు. ఇక తన కుమారుడు జిల్లా కలెక్టర్ అయిన వార్త విని.. అబ్దుల్ నాజర్‌ తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయారు. నిరుపేద కుటుంబంలో పుట్టి.. చిన్నతనంలోనే అనేక కష్టాలను ఎదుర్కొని.. చివరికి కలెక్టర్ అయిన అబ్దుల్ నాజర్ కథ కేవలం ఒక విజయ గాథ మాత్రమే కాదు.. నిస్సహాయ స్థితిలో కూడా పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యం కూడా సుసాధ్యం చేయొచ్చనే గొప్ప పాఠాన్ని చెబుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa