జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దాయాదికి తావి వరదల గురించి భారత్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా ఈ సమాచారాన్ని పంపినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పాక్ మీడియా నివేదించింది. పహల్గామ్ దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా రద్దుచేసిన విషయం తెలిసిందే. . అయితే, దీనిని న్యూఢిల్లీగానీ, పాకిస్థాన్‌గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ఒకవేళ ఇదే నిజమైతే ఒప్పందం రద్దు తర్వాత పాకిస్థాన్‌కు తొలిసారి భారత్ సింధూ నది జలాల గురించి దౌత్యమార్గాల్లో తొలిసారి సమాచారం ఇచ్చినట్టయ్యింది
వాస్తవానికి సింధూ, దాని ఉప-నదుల్లో నీటి మట్టాలు, వరదల గురించి ఒప్పందంలో భాగంగా కమిషనర్ల ద్వారా సమాచారం అందజేస్తారు. కానీ, ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో హైకమిషన్ ద్వారా అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలకు తావి నదికి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని పాకిస్థాన్‌ను భారత్ అప్రమత్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు, నివేదికలు పేర్కొన్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ సమాచారం చేరవేసినట్టు తెలిపాయి. భారత్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే పాకిస్థాన్ అధికారులు తావీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను వరదలపై అప్రమత్తం చేసినట్టు చెప్పాయి.
హిమాలయాల్లోని టిబెట్‌లో ప్రారంభమయ్యే సింధు నది కశ్మీర్ గుండా ప్రవహించి, పాకిస్థాన్ అంతటా ప్రవహిస్తుంది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. సింధు, దాని ఉపనదుల జలాలను ఎలా వినియోగించాలనేది ఈ ఒప్పందం నిర్ణయిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. సింధు నదీ వ్యవస్థ నుంచి భారతదేశానికి 20 శాతం.. మిగిలిన 80 శాతం నీటిని పాకిస్థాన్ వినియోగించుకుంటోంది. పశ్చిమ నదులు (సింధు, జీలం, చీనాబ్) పాక్‌కు.. తూర్పు నదులు (రావి, బియాస్, సట్లెజ్) భారతదేశానికి కేటాయించారు. అదే సమయంలో ఇది ప్రతి దేశం మరొక దేశానికి కేటాయించిన నదుల నిర్దిష్ట ఉపయోగాలను అనుమతిస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడిన పాక్ ఉగ్రవాదులు.. 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటన తర్వాత దాయాదిపై భారత్ దౌత్యపరమైన చర్యలను తీసుకుంది. ఇందులో ఒకటి సింధు జలాల ఒప్పందం నిలిపివేత. కాగా, ఈ ఏడాది వర్షాకాలంలో ఇప్పటి వరకూ పాక్‌ను వరదలు ముంచెత్తి.. కనీసం 780 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 1000 మందికిపైగా గాయపడ్డారు. జూన్ 26 నుంచి పాకిస్థాన్‌ను భారీ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa