ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ ఏఐలో సరికొత్త విప్లవం,,,,రిలయన్స్ నుంచి కొత్త కంపెనీ

business |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 11:00 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో కొత్త కంపెనీని లాంచ్ చేశారు. రిలయన్స్ వార్షిక సాధారణ సర్వసభ సమావేశంలో కొత్త కంపెనీపై కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో కొత్త అనుబంధ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. భారత దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం, ఏఐ ఆవిష్కరణలకు భారత్‌ను ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ అనుబంధ సంస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కొత్త సంస్థ నాలుగు స్పష్టమైన లక్ష్యాలతో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


'ఇది రిలయన్స్‌కు, భారత దేశ డిజిటల్ భవిష్యత్తుకు ఒక ప్రతిష్టాత్మక అడుగు. రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనేది నాలుగు స్పష్టమైన లక్ష్యాలతో రూపుదిద్దుకుంది. ఈ నాలుగు అంశాలు ప్రపంచ ఏఐ ఆవిష్కరణల్లో భారత్‌ను ముందుంచేందుకు దోహదపడతాయి' అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో ముకేశ్ అంబానీ ప్రకటించారు.


రిలయన్స్ ఇంటెలిజెన్స్ గిగావాట్ స్కేల్, ఏఐ రెడీ డేటా కేంద్రాలను నిర్మిస్తుంది. ఇప్పటికే గుజరాత్‌లోని జామ్ నగర్‌లో గిగావాట్ స్కేల్ ఏఐ రెడీ డేటా కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా ఏఐ మౌలిక సదుపాయాల్లో భవిష్యత్తు తరం ఏఐకి భారత్‌ను కేంద్రంగా చేయాలని లక్ష్యం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా దశల వారీగా ఈ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తారు. ఈ సౌకర్యాలు రిలయన్స్ కొత్త ఎనర్జీ ఎకోసిస్టమ్ నిర్వహణలో ఉంటాయి. AI శిక్షణ, ఇన్‌ఫెరెన్స్ కోసం రూపొందించారు.


గ్లోబల్ పార్ట్నర్‌షిప్స్


ఈ కొత్త కంపెనీ ప్రపంచంలోని ఉత్తమ టెక్నాలజీ కంపెనీలు, ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలను ఒకతాటిపైకి తేనుంది. ఆయా సంస్థల నైపుణ్యాలను రిలయన్స్ ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలతో మిలితం చేయనుంది. ఏఐలో నాయకత్వం వహించడం, స్థిరమైన సరఫరా, ఏఐలో భారత్ ఫస్ట్ అనుగుణంగా పని చేయనుంది.


భారత్‌ కోసం ఏఐ సేవలు


భారత్‌లోని వినియోగదారులు, చిన్న వ్యాపారాలు, ఎంటర్‌ప్రైజెస్‌లతో పాటు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వ్యవసాయం వంటి క్రిటికల్ సెక్టార్లకు నమ్మకమైన, సులభంగా ఉపయోగించే ఏఐ పరిష్కారాలను రిలయన్స్ ఇంటెలిజెన్స్ అందించనుంది. ప్రతి ఒక్క భారతీయుడికి అందుబాటు ధరలో, నమ్మకమైనవిగా ఈ సేవలు అండనున్నాయని అంబాని నొక్కి చెప్పారు.


టాలెంట్ ఇంక్యుబేషన్


రిలయన్స్ ఇంటెలిజెన్స్ సంస్థ ప్రపంచ స్థాయి పరిశోధకులు, ఇంజినీర్లు, డిజైనర్లు, ప్రొడక్ట్ బిల్డర్లకు ప్రధాన కేంద్రంగా మారనుంది. పరిశోధనల వేగం, ఇంజినీరింగ్ నైపుణ్యాలతో మిలితం చేసి వారి ఆలోచనలను ప్రాక్టికల్ సొల్యూషన్స్‌గా మార్చడమే లక్ష్యం. రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనేది సరికొత్త ఆవిష్కరణలు, అప్లికేషన్లను భారత్ సహా ప్రపంచం కోసం తీసుకురానుందని అంబానీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa