మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే సర్కారు మాజీ ఉపరాష్ట్రపతికి కేటాయించిన ప్రభుత్వ బంగ్లాకు వెళ్లడానికి బదులుగా.. తన పాత స్నేహితుడైన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు అభయ్ చౌతాలా ఫామ్‌హౌస్‌కు మకాం మార్చారు. దీంతో దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. అసలు ఆయన ఎందుకు సర్కారు బంగ్లాకు వెళ్లలేదు, స్నేహితుడి ఫామ్‌హౌస్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. మదేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవికి రాజీనామా చేసిన తర్వాత నుంచి దన్ఖడ్ ఎక్కడా కనిపించలేదు. కానీ తాజాగా ఈయన ఇళ్ల మారడానే వార్త రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
జగదీప్ దన్ఖడ్ సోమవారం రోజు సాయంత్రం తన అధికారిక నివాసాన్ని వీడినట్లు అధికారులు ప్రకటించారు. లాగే దక్షిణ ఢిల్లీ ఛతర్‌పూర్ గదైపూర్‌లో ఉన్న తన స్నేహితుడి ఫామ్‌హౌస్‌కు మారినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రైవేటు ఫామ్‌హౌస్ జాతీయ లోక్‌దళ్ నేత అభయ్ చౌతాలాకు చెందినదని అధికారిక వర్గాలు తెలిపాయి. మాజీ ఉపరాష్ట్రపతిగా దన్ఖడ్ ఢిల్లీలో టైప్-8 బంగళా పొందేందుకు అర్హులు. కానీ ఆయనకు అధికారిక బస ఏర్పాటు చేసే వరకు తాత్కాలిక ప్రాతిపదికన ఫామ్‌హౌస్‌లో నివసిస్తారని ఆ వర్గాలు వివరించాయి.
అయితే అభయ్ చౌతాలాతో దన్ఖడ్‌కు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. అభయ్ చౌతాలా తాత, మాజీ ఉప ప్రధాన మంత్రి దేవిలాల్‌ను జగదీప్ దన్ఖడ్ తన రాజకీయ గురువుగా భావిస్తారు. ఒకప్పుడు న్యాయవాదిగా ఉన్న దన్ఖడ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది దేవిలాలే. వారి మధ్య ఉన్న బలమైన సంబంధాలను అభయ్ చౌతాలా కూడా ధ్రువీకరించారు. "మా ఇద్దరి మధ్య పాత కుటుంబ బంధాలు ఉన్నాయి. ఆయన మా కుటుంబ సభ్యుడి వంటివారు. ఆయన ఎక్కడికి మకాం మారుస్తున్నారని నేను అడిగినప్పుడు, ఆయన ఆలోచిస్తున్నానని చెప్పారు. నేను వెంటనే మా ఇంటిని తన ఇల్లుగా భావించి ఉండమని చెప్పాను. కొత్త అధికారిక నివాసం కేటాయించి సిద్ధమయ్యే వరకు ఆయన మా ఇంట్లోనే ఉండవచ్చు" అని అభయ్ చౌతాలా తెలిపారు.
జులై 21వ తేదీన జగదీప్ దన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలను పేర్కొంటూ ఆకస్మికంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఒక ఉపరాష్ట్రపతి.. పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేయడం అసాధారణమైన విషయం కాగా అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని ప్రతిపక్షాలు చెప్పుకొచ్చాయి. ముఖ్యంగా రాజీనామా తర్వాత నుంచి దన్ఖడ్ బహిరంగంగా కనిపించకపోవడంతో.. అంతా ఆయనకు ఏమైందో చెప్పాలంటూ సర్కారును అడిగారు. ముఖ్యంగా అమిత్ షా, ప్రధాని మోదీలనే నేరుగా ప్రశ్నించారు.
మాజీ ఉపరాష్ట్రపతిగా దన్ఖడ్ కొన్ని ప్రత్యేక సౌకర్యాలకు అర్హులు. వీటిలో నెలకు రెండు లక్షల రూపాయల పెన్షన్, టైప్-8 బంగ్లాతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఇతర సేవలు పొందవచ్చు. ప్రస్తుతం ఆయనకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఒక టైప్-8 బంగ్లా కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే దానికి మరమ్మతులు చేసి.. నివాసయోగ్యంగా మార్చడానికి కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆయన అభయ్ చౌతాలా ఫామ్‌హౌస్‌లోకి మకాం మార్చారు. ఈ మూడు నెలలు ఆయన అక్కడే ఉండబోతున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి భవనాన్ని ఆయన వారసుడి కోసం సిద్ధం చేస్తున్నారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa