ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-నేపాల్ సరిహద్దుల్లో హైఅలర్ట్.. ఎవరు బోర్డర్ దాటవచ్చనే దానిపై ఆంక్షలు

international |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 08:52 PM

సోషల్ మీడియాపై నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా యువతరం చేపట్టిన జెన్-జెడ్ ఆందోళనలతో నేపాల్‌ అట్టుడుకుతోంది. ఈ ఆందోళనల్లో నేపాల్ మాజీ ప్రధాని భార్య సహా 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా పొరుగు దేశంలో జరుగుతోన్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. నేపాల్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన భారత్.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సశస్త్ర సీమ బల్‌ దళాలను మోహరించింది. ‘‘నేపాల్ సరిహద్దుల్లో హైఅలర్ట్ జారీచేశాం.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర సాయుధ పోలీస్ విభాగం సశస్త్ర సీమ బల్‌ భద్రతను పర్యవేక్షిస్తోంది’’ ఓ ఉన్నతాధికారి తెలిపారు. నేపాల్ సరిహద్దుల్లోని ఉత్తర్ ప్రదేశ్, బిహార్ జిల్లాల్లో మార్కెట్లు స్తంభించాయి. ఇప్పటికే నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకున్నారు.


ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, సిక్కిమ్, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలకు ఆనుకుని భారత్‌‌, నేపాల్‌ మధ్య మొత్తం 1,750 కి.మీ. మేర సరిహద్దు ఉంది. 1950లో భారత్, నేపాల్ మధ్య జరిగిన శాంతి, స్నేహ ఒప్పందాన్ని అనుసరించి ఈ సరిహద్దుల నుంచి ఇరు దేశాల ప్రజల రాకపోకలు, వస్తువుల రవాణాపై ఎటువంటి నిషేధం ఉండదు. కానీ, నేపాల్‌లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులతో బోర్డర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖఏరీ జిల్లాలోని గౌరీపట్న బోర్డర్ వద్ద నేపాల్ పౌరులను భారత్‌లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ, పొరుగు దేశాలకు వెళ్లిన భారతీయులు వస్తే మాత్రం వారిని అనుమతిస్తున్నారు. అటు, నేపాల్ సైతం ఇలాంటి చర్యలే తీసుకుంది. నేపాల్‌లోకి వచ్చే భారతీయులను అనుమతించని ఆ దేశ అధికారులు.. పనిమీద లేదా పర్యటన కోసం భారత్‌కు వెళ్లిన తమ పౌరులను మాత్రం తిరిగి రావడానికి అనుమతిస్తున్నారు.


పశ్చిమ్ బెంగాల్‌ డార్జిలింగ్ జిల్లాలోని పనిటంకీ సరిహద్దు వద్ద సరకు రవాణా వాహనాలు నిలిచిపోయి బారులు తీరాయి. ఆ ప్రాంత ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘భద్రత బలగాలతో కూడిన పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశామని అన్నారు. తాము అప్రమత్తంగా ఉన్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ సహా ఇతర నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ విధంగానే అలర్ట్ అయ్యారు.


మరోవైపు, నేపాల్‌లో కల్లోల పరిస్థితుల వేళ.. భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. మూక హింసలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. నేపాల్‌కు అనవసర ప్రయాణాలను వాయిదా వేయాలని కోరింది. అత్యవపరమైతే తప్పా నేపాల్‌‌కు వెళ్లొద్దని విదేశాంగ శాఖ సూచించింది.


‘‘అత్యంత సన్నిహిత మిత్రుడిగా, పొరుగువారిగా సంబంధిత వారంతా సంయమనం పాటిస్తారని, శాంతియుత మార్గాలు మరియు సంభాషణల ద్వారా ఏవైనా సమస్యలను పరిష్కరించుకుంటారని మేము ఆశిస్తున్నాం.. కాఠ్మాండు సహా నేపాల్‌లోని అనేక ఇతర నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు.. నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి.. నేపాల్ అధికారులు జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను పాటించాలి’’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది.


ఇదే సమయంలో ఇరు దేశాలూ విమాన సర్వీసులను రద్దుచేశాయి.


ఇదిలా ఉండగా, నేపాల్‌ పాలనలో సమూల మార్పులు అశిస్తోన్న యువత.. అందుకు కొన్ని డిమాండ్లను ముందుంచింది. ‘‘మా ఈ ఉద్యమం ఓ పార్టీ, ఓ వ్యక్తి కోసమో కాదు. మొత్తం ఒక తరం, దేశ భవిష్యత్తు కోసం. నూతన రాజకీయ వ్యవస్థ ద్వారానే శాంతి నెలకొంటుంది. అధ్యక్షుడు, సైన్యం మా ప్రతిపాదనలను సానుకూలంగా అమలుచేస్తుందని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రస్తుత ఉన్న రాజ్యాంగాన్ని మార్చి రాయాలని, గత 30 ఏళ్లుగా రాజకీయ పార్టీలు సాగించిన అవినీతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa