ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నా గుండె ముక్కలైంది": తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 08:10 PM

తమిళనాడులోని కరూర్‌లో శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాట ఘటనలో.. మృతుల సంఖ్య 39కి చేరుకుంది. మృతుల్లో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ దుర్ఘటనపై తమిళగ వెట్రి కజగం అధినేత, నటుడు విజయ్ తొలిసారిగా స్పందించారు. తన గుండె ముక్కలైందని, వర్ణించలేని దుఃఖంతో కుమిలిపోతున్నానని తీవ్ర భావోద్వేగంతో వెల్లడించారు.


ఈ ఘటన జరిగిన వెంటనే కరూర్‌ నుంచి బయలుదేరిన విజయ్.. ఆ తర్వాత చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. అయితే ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు. తొక్కిసలాట వార్తలు వెలువడిన కొన్ని గంటల తర్వాత ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులోనే "నా గుండె ముక్కలైంది. మాటల్లో చెప్పలేని, భరించలేని దుఃఖం, బాధతో కుమిలిపోతున్నాను" అని ఆయన రాసుకొచ్చారు. "కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరసోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన అందులో పేర్కొన్నారు.


వాస్తవానికి టీవీకే అధినేత మధ్యాహ్నం 12 గంటలకే కరూర్ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆయన దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే ఆయన్ను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రచార బస్సు కూడా రోడ్డుపై వెళ్లడానికి స్థలం లేనంతగా జనసమూహం పెరిగిపోయింది.


ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఇది నిర్వాహకుల ఉద్దేశపూర్వక కుట్ర అని ఆరోపించారు. "ఈ కార్యక్రమం ఒక నిర్దిష్ట సమయంలో ప్రారంభం కావాలని విజయ్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. అది జరగలేదు. ప్రజలు దాదాపు ఆరు గంటలు వేచి ఉన్నారు. నిర్వాహకులు ఎందుకు ఇలా చేశారు? జనసమూహాన్ని మరింత ఎక్కువగా సమీకరించడానికి వారు ఈ చవకబారు వ్యూహాన్ని ఉపయోగించారు. ఇది నిర్వాహకుల నేరపూరిత నిర్లక్ష్యం" అని ఆయన మీడియాకు తెలిపారు. అంతేకాకుండా "ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో.. వారిని అరెస్టు చేయాలి. విజయ్ కూడా దీనికి బాధ్యుడు. ఆయన బాధ్యత నుంచి తప్పించుకోలేరు" అని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.


ఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరపడానికి.. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఒక ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. "ఈ అమూల్యమైన ప్రాణాల నష్టం మనందరి హృదయాలను కలచివేసింది. ఈ తీరని నష్టాన్ని అనుభవించిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆసుపత్రుల్లో చేరిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని నేను ఆదేశించాను. ఈ రాత్రి నేను కరూర్‌కు వెళ్లి మృతుల కుటుంబాలను కలుసుకుని, వారికి సానుభూతి తెలియజేస్తాను. అలాగే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని కూడా సందర్శిస్తాను" అని ముఖ్యమంత్రి తన ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa