ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్‌లో భారతీయ బాలిక బలవంతపు దత్తత.. రక్షించాలని అంతర్జాతీయ పిటిషన్

international |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 08:07 PM

ఏడేళ్ల భారత సంతతి చిన్నారిని.. ఆమె తల్లి నుంచి శాశ్వతంగా వేరే చేసేలా లండన్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. తల్లి నుంచి బిడ్డను వేరు చేయడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తల్లి నుంచి చిన్నారిని శాశ్వతంగా వేరు చేసి, ఇతరులకు దత్తత ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు తీర్పునివ్వడం పూర్తిగా అన్యాయమని మహిళా సాధికారత సంస్థలు, భారతీయ సమాజం గళమెత్తుతున్నాయి.


దారుణమైన గృహ హింస నుంచి ప్రాణాలతో బయటపడింది ఓ మహిళ. ఆ బాధ నుంచి కోలుకుని తన బిడ్డకు సురక్షితమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో ప్రయత్నించింది. కౌన్సిలింగ్, థెరపీ, గృహ హింస పునరావాస కార్యక్రమాల్లో పాల్గొని, తాను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నానని నిరూపించుకుంది. మానసికంగా తీవ్ర వేధన అనుభవించిన ఆ మహిళ.. తన బిడ్డను పెంచి పెద్ద చేసే స్థితిలో లేదని భావిస్తూ కోర్టు ఆ బిడ్డను తల్లికి అప్పగించేందుకు నిరాకరించింది.


ఈ ఏడాది ప్రారంభంలో ఫ్యామిలీ కోర్టు సదరు బాలికను స్థానిక అధికారులకు దత్తత కోసం అప్పగిస్తూ కేర్ అండ్ ప్లేస్‌మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. దీనిపై తల్లి అప్పీల్ దాఖలు చేశారు. కానీ 2025 అక్టోబర్‌లో కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆ అప్పీల్‌ను నిరాకరించింది. దీంతో ఆ తల్లి న్యాయ పోరాటం ముగిసినట్లయింది. ఈ తీర్పుతో బిడ్డను దత్తత ఇచ్చేందుకు స్థానిక అధికారులకు మార్గం సుగమమైంది. అయినప్పటికీ ఆ తల్లి అంతర్జాతీయ, మానవతా చట్టపరమైన మార్గాల ద్వారా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. తాను పూర్తిగా కోలుకున్నానని, తన బిడ్డను సురక్షితంగా చూసుకుంటానని పేర్కొంటున్నారు. ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నట్లు అధికారులు వేరే దంపతులకు ఆ చిన్నారిని దత్తతగా ఇస్తే.. ఆ చిన్నారికి తన తల్లితో ఉన్న చట్టపరమైన సంబంధాన్ని మాత్రమే కాక, తన భారతీయ సాంస్కృతిక గుర్తింపును కూడా శాశ్వతంగా కోల్పోతుంది.


వుమెన్ ఎంపవర్‌మెంట్ నెట్‌వర్క్ యూకే వంటి సంస్థలు ఈ నిర్ణయాన్ని అన్యాయమని, అనాగరికమని అభివర్ణిస్తున్నాయి. తల్లి సాధించిన పురోగతిని, అలాగే బిడ్డకు సాయం చేయడానికి కమ్యూనిటీ సభ్యులు ముందుకొస్తున్న విషయాన్ని కోర్టు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. చిన్నారికి తాత్కాలికంగా సురక్షితమైన ఆశ్రయం కల్పించి, భవిష్యత్తులో తల్లితో కలిసే అవకాశం ఉండేలా ఫాస్టరింగ్ సదుపాయాన్ని కల్పించడానికి చాలా మంది కమ్యూనిటీ సభ్యులు ముందుకు వచ్చినా కోర్టు అవేవీ పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు ఏమాత్రం న్యాయం కాదని, ఒక బాధితురాలికి విధించిన శిక్ష అని ఆ సంస్థలు పేర్కొంటున్నాయి.


లండన్ బరో ఆఫ్ న్యూహామ్ అధికారులు దత్తత ప్రక్రియకు లేదా దత్తత కోసం మ్యాచ్ చేయడానికి సంబంధించిన అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలి. తద్వారా అంతర్జాతీయ న్యాయ సమీక్ష పూర్తయ్యేందుకు అవకాశం ఇవ్వాలి. భారత హైకమిషన్ ఈ చిన్నారి సాంస్కృతిక మరియు కుటుంబ హక్కులు గౌరవించబడేలా చర్యలు తీసుకోవాలి. ఈ అన్యాయాన్ని ఆపడానికి ప్రజలందరూ పిటిషన్‌పై సంతకం చేసి, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని న్యూహామ్ కౌన్సిల్‌కు ఈమెయిల్స్ పంపి మద్దతు తెలపాలని సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కుటుంబంలో పెరగడం ప్రతి బిడ్డ ప్రాథమిక హక్కు అని హింస నుంచి బయటపడ్డ ప్రతి తల్లికి కోలుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బిడ్డను తల్లితో వేరు చేసి శిక్షి విధించడం సరికాదని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa