ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భారతీయులను నమ్మకూడదు, వారినెప్పటికీ మార్చలేం': ట్రంప్ నామినీ చాట్ లీక్

international |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 07:24 PM

డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ కౌన్సెల్ నేతృత్వ బాధ్యతల కోసం నామినేట్ అయిన పాల్ ఇంగ్రాసియా.. రిపబ్లికన్ల వాట్సాప్ గ్రూప్ చాట్‌లో జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తోటి రిపబ్లికన్లతో మాట్లాడుతూ.. భారతీయులను నమ్మకూడదని, వారిని ఎప్పటికీ మార్చలేమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దేశంలోని ఉన్నత నాయకత్వ స్థానాల్లో శ్వేత జాతీయులు మాత్రమే ఉండాలని వివరించారు. నల్ల జాతీయుల విషయంలో తనకు అప్పుడప్పుడూ నాజీ తరహా ఆలోచనలు వస్తుంటాయన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చాట్ లీక్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


అయితే భారతీయ-అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అంటే 2024 మేలో జార్జియాలో నియమించుకున్న ట్రంప్ ప్రచార సిబ్బందిని కేవలం మైనార్టీ ఓటర్లను ఆకర్షించడం కోసమే అని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఆఫ్రికా మొత్తం ఒక చెత్త ప్రాతం అని, ఎల్లప్పుడూ అది అలాగే ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన చాటింగ్ ఇప్పుడు లీక్ కావడంతో పాల్ ఇంగ్రాసియాపై పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు.


వివేక్ రామస్వామి 1985 ఆగస్టు 9వ తేదీన ఒహైయోలో జన్మించారు. హార్వార్డ్ నుంచి బయోలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన యేల్ లా స్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. సోషల్ మీడియా వేదికగా తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా అభివర్ణించుకుంటూ ఉంటారు. అలాగే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సొంతంగా బయోటెక్ సంస్థను స్థాపించి.. 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తనరఫున అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌కి పోటీగా నిలిచారు. కానీ సరైన మద్దతు లభించకపోవడంతో పోటీ నుంచి వైదొలిగారు. ఇదిలా ఉండగా.. 2026 నవంబర్‌లో జరగను ఓహైయో నుంచి గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే సొంత పార్టీకి చెందిన నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి.


అసలేవరీ పాల్ ఇంగ్రాసియా?


పాల్ జోసెఫ్ ఇంగ్రాసియా ఒక అమెరికన్ న్యాయవాది. అలాగే రాజకీయ వ్యాఖ్యాత. అతను 2025లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కు వైట్‌హౌస్ అనుసంధానకర్తగా పని చేశారు. కార్నెల్ లా స్కూల్‌లో చదువుకున్న ఆయన.. నేషనల్ రివ్యూ వంటి అవుట్‌లెట్‌లకు పని చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచుగా ఆయన ఉద్వేగభరితమైన రాజకీయ వ్యాఖ్యానాలను ఉదహరించేవారు. 2025 మేలో ఫెడరల్ విజిల్‌బ్లోయర్‌లను పరిరక్షించే స్వతంత్ర సంస్థ అయిన యు.ఎస్. ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సెల్‌కు నాయకత్వం వహించడానికి ట్రంప్ అతన్ని నామినేట్ చేశారు. ఈక్రమంలోనే ఆయన చేసిన జాత్యాహంకార కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa