ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తూ బస్సులో మంటలు చెలరేగితే.. చేయాల్సిన పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 05:51 PM

ప్రమాదం.. అది ఎప్పుడు, ఎటువైపు నుంచి ముంచుకువస్తుందో చెప్పడం కష్టం.. అలా ఊహించడం అసాధ్యం.. కానీ అప్రమత్తతే మన చేతిలోఉన్న ఆయుధం. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాన్ని అయినా కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగినకావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. ఆ కుటుంబాల ఆవేదన అరణ్య రోదనగా మారింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం మరింత బాధకు గురి చేస్తోంది. కావేరీ ట్రావెల్స్ బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టగా.. బైక్ బస్సు కింది భాగంలో చిక్కుకుపోయింది. అనంతరం కొంతదూరం పాటు బస్సు బైక్‌ను అలాగే ఈడ్చుకుపోవటంతో.. రాపిడికి మంటలు చెలరేగాయి. మంటలు బస్సు మొత్తం వ్యాపించి.. పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణం సమయంలో బస్సులో మంటలు చెలరేగితే ఏం చేయాలనే విషయంపై చర్చ జరుగుతోంది.


బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగినప్పుడు.. వెంటనే ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో కిందకు వంగి సమీపంలోని ఎగ్జిట్ వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీని వలన పొగ నుంచి తప్పించుకోవచ్చంటున్నారు. అలాగే ప్రయాణ సమయంలో బస్సులోకి ఎక్కిన వెంటనే తలుపులు, అత్యవసర ద్వారాలు, కిటికీలు ఎక్కడ ఉన్నాయనేదీ పరిశీలించాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో కిటికీలు పగలగొట్టేందుకు సుత్తి వంటి పరికరాలు అందుబాటులో ఉంచాలి. అవి ఎక్కడ ఉన్నాయనేదీ పరిశీలించాలి.


మరోవైపు తలుపులు తెరుచుకోని పరిస్థితుల్లో సుత్తి లేదా ఇతర బలమైన వస్తువులతో కార్నర్‌లోని కిటికీలను పగలగొట్టి బయటపడే ప్రయత్నం చేయాలి. బ్యాగులు, ఫోన్లు, సామాన్లు కోసం వేచి చూడకూడదని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం చాలా విలువైనదని అధికారులు సూచిస్తున్నారు. పొగ చూరకుండా ఉండేందుకు నోరు, ముక్కులను కప్పి ఉంచుకోవాలని చెప్తున్నారు. అలాగే బస్సులో చిన్న పిల్లలు, వృద్ధులు, గాయపడిన వారు ఉంటే వారికి సహాయం చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో భయపడకుండా.. ప్రశాంతంగా ఆలోచిస్తూ, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. అలాగే ఎక్కువ మంది ఉన్నవైపు కాకుండా.. తక్కువమంది ఉన్న ఎగ్జిట్‌లను ఎంచుకోవాలంటున్నారు. సురక్షితంగా బయటపడితే.. ఆ విషయాన్ని రెస్క్యూ బృందాలకు తెలియజేయాలని చెప్తున్నారు.


మరోవైపు బస్సు ఆపరేటర్లు కూడా సీట్లు, కర్టెన్లు, ప్యానెల్స్ వంటి వాటిలో ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అత్యవసర ద్వారాలు ఎక్కడున్నాయనేదీ స్పష్టం కనిపించేలా బస్సులో మార్కింగ్ ఉండాలంటున్నారు. అలాగే సుత్తితో కొడితే పగిలిపోయేలా ఉన్న బ్రేకబుల్ విండోస్ ఏర్పాటు చేయాలంటున్నారు. ఏసీ వైరింగ్, బ్యాటరీలు, ఫ్యూయల్ లైన్స్ వంటి ఎలక్ట్రికల్, ఇంధన వ్యవస్థలను తరుచుగా చెక్ చేస్తుండాలని చెప్తున్నారు.


అలాగే ప్రతి బస్సులోనూ మంటలను నియంత్రించే అగ్నిమాపక యంత్రాలు ఉంచాలని.. వీటిని ఎలా ఉపయోగించాలనే దానిపై బస్సు డ్రైవర్లు, సిబ్బందికి తప్పనిసరిగా ట్రైనింగ్ ఇవ్వాలంటున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి బస్సులో మంటలు చెలరేగితే ఫైర్ స్టేషన్లను ఆటోమేటిక్‌గా అలర్ట్ చేసేలా సెన్సార్లు, జీపీఎస్ లింక్డ్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఏర్పాటు చేస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa