ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.20 లక్షలు తిప్పి పంపిన కరూర్ తొక్కిసలాట బాధిత ఫ్యామిలీ,,,విజయ్‌కు షాక్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 08:57 PM

సెప్టెంబరు 27న కరూర్‌లో తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కులను రెండు రోజుల కిందట మహాబలిపురం రిసార్ట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నటుడు విజయ్ అందజేశాడు. అయితే, ఓ బాధిత కుటుంబం విజయ్‌ ఇచ్చిన చెక్కును తిరిగి పంపడం చర్చనీయాంశంగా మారింది. మృతుల కుటుంబసభ్యుల బ్యాంకు అకౌంట్లలో పరిహారాన్ని టీవీకే అక్టోబరు 18న జమచేసింది. అయితే, మృతుల్లో ఒకరైన రమేశ్‌ భార్య సంఘవి మాత్రం విజయ్ ఇచ్చిన పరిహారం తిప్పి పంపారు.


‘తొక్కిసలాట జరిగిన కొద్ది రోజుల తర్వాత వీడియో కాల్ చేసి మాట్లాడిన విజయ్ నేరుగా వచ్చి మమ్మల్ని ఓదారుస్తామని అన్నారు.. ముందుగా ఆర్థిక సాయం తీసుకోవాలని చెప్పారు.. కానీ, మాకు డబ్బులు ముఖ్యం కాదు. మేము ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. విజయ్‌ ఆహ్వానించిన మహాబలిపురంలో జరిగిన సమావేశానికి వెళ్లలేదు.. కానీ, టీవీకే కార్యకర్తలు మా అత్త, ఆడపడుచు, ఆమె భర్తను తీసుకెళ్లారు’ అని సంఘవి తెలిపారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా అకౌంట్‌లో జమచేసిన రూ.20 లక్షల మొత్తాన్ని వెనక్కి పంపామని ఆమె వివరించారు.


ఆమె అత్త కూడా మహాబలిపురం సమావేశానికి వెళ్లేందుకు నిరాకరించారు. విజయ్‌ను కలవడానికి తమ బంధువులను తీసుకెళ్లే ముందు టీవీకే తమను సంప్రదించలేదని వారు ఆరోపించారు. ఈ పరిణామాలతో తీవ్ర ఒత్తిడికి గురైన తాము పరిహారాన్ని తిప్పి పంపాలని నిర్ణయించుకున్నట్టు సంఘవి తెలిపారు. డబ్బు పంపిన రసీదును కూడా ఆమె చూపించారు. కరూర్ జిల్లా కొడంగిపట్టికి చెందిన సంఘవి భర్త రమేశ్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఇక, మహాబలిపురంలోని రిసార్టులో బాధితులను కలిసిన టీవీకే అధినేత.. వారికి క్షమాపణలు చెప్పారు. వారికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు, నెల రోజుల తర్వాత విజయ్ మళ్లీ తన రాజకీయ కార్యకలాపాలను మంగళవారం మొదలుపెట్టారు. ఇటీవల కురిసి వర్షాలకు రైతులను ఆదుకోవడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని విజయ్ ఆరోపించారు. టీవీకే కార్యక్రమాల సమన్వయం కోసం జనరల్ సెక్రెటరీ ఎన్ ఆనంద్, అధర్ అర్జున్ సహా 28 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని విజయ్ నియమించారు. ద్వితీయశ్రేణి నాయకత్వం నిర్మాణంపై వస్తున్న విమర్శలకు దీంతో చెక్ పడినట్టయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa