అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధి పొందాలని భావిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు ఆ దేశం చేదువార్త చెప్పింది. అత్యంత ఆదరణ పొందిన హెచ్-1బీతో పాటు పలు రకాల ఇమ్మిగ్రేషన్ వీసాల 'ప్రీమియం ప్రాసెసింగ్' ఫీజులను పెంచుతూ అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం ప్రభావం దృష్ట్యా ఈ ధరల సవరణ చేపట్టినట్లు వెల్లడించిన యూఎస్‌సీఐఎస్.. కొత్త ఫీజులు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ద్రవ్యోల్బణం సెగ.. వీసా ఫీజులపై పడగ!
జూన్ 2023 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ సర్దుబాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా వీసా దరఖాస్తుల పరిష్కారానికి నెలల సమయం పడుతుంది. అయితే త్వరగా ఫలితం ఆశించే వారు (ఎక్స్‌పెడైటెడ్ సర్వీస్) భారీగా డబ్బు చెల్లించి 'ప్రీమియం ప్రాసెసింగ్' సదుపాయాన్ని వాడుకుంటారు. ఇప్పుడు ఆ సేవలే మరింత ప్రియం కానున్నాయి.
ఏ వీసాకు ఎంత భారం?
మార్చి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫీజులు ఇలా ఉండబోతున్నాయి. హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల ఫీజు 2,965 డాలర్లకు పెరిగింది. అలాగే గ్రీన్ కార్డ్ దరఖాస్తుల(I-140) ఎంప్లాయిమెంట్ బేస్డ్ పిటిషన్ల ఫీజు కూడా 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు చేరింది. ఇక ఎఫ్-1 విద్యార్థులు కోరుకునే OPT, STEM-OPT ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది. అలాగే విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల స్టేటస్ మార్పు ఫీజు 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది.
అమెరికాలో హెచ్-1బీ వీసాలను అత్యధికంగా పొందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఉద్యోగ మార్పులు (H-1B Transfer), వీసా పొడిగింపుల సమయంలో చాలామంది భారతీయ నిపుణులు ప్రీమియం ప్రాసెసింగ్‌నే నమ్ముకుంటారు. అలాగే అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టా పొంది స్థానికంగా ఉద్యోగాల్లో చేరే భారతీయ విద్యార్థులు కూడా ఈ ఫీజుల పెంపు వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడనున్నారు.పెరిగిన ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యూఎస్‌సీఐఎస్ కార్యకలాపాల ఆధునీకరణకు వాడనున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం, డిజిటలైజేషన్ పక్రియను పెంచడం వంటి అంశాలకు ఈ నిధులను వెచ్చిస్తామని స్పష్టం చేసింది. మార్చి 1వ తేదీ కంటే ముందే పిటిషన్లు దాఖలు చేసే వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. కాబట్టి అత్యవసర ప్రాసెసింగ్ అవసరమున్న వారు ఫిబ్రవరి ఆఖరులోపు దరఖాస్తులు పూర్తి చేసుకోవడం ఉత్తమం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa