మీరు ఎవరికైనా మెసేజ్ లేదా ఫొటోలు పంపాలనుకుంటే ఏ యాప్ ను ఉపయోగిస్తారు? ఈ ప్రశ్నకు వాట్సాప్ అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వస్తుంది. ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాట్సాప్ అందుబాటులోకి రాకముందు మనకి తెలిసిన చాటింగ్ యాప్ మన మొబైల్స్ లో ఉండే మెసేజింగ్ ఫీచర్ మాత్రమే. మాట్లాడే అవసరం లేకుండా సందేశాలు పంపాలంటే మెసేజింగ్ ను ఆశ్రయించాల్సిందే. ఒక్కసారి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇక మెసేజింగ్ ఊసే లేకుండా పోయింది. వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక మన ఫోన్ లో మెసేజింగ్ అనే విషయం ఉంటుందని కూడా మర్చిపోయి ఉంటారు. సర్వీస్ ప్రొవైడర్లు, పంపే మెసేజ్ లు ఫార్వర్డ్ మెసేజ్ లకు మాత్రమే ఈ మెసేజింగ్ యాప్ పరిమితమైంది. వాట్సాప్ లో ఉచితంగా ఎన్ని మెసేజ్ లు అయినా పంపే అవకాశం ఉండటం, దీంతో పాటు ఫొటోలు వీడియోలు షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఉండటంతో అతి కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ మారింది. అయితే వాట్సాప్ కు చెక్ పెట్టి.. మెసేజింగ్ యాప్ కు పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు తెర వెనుక ప్రారంభమయ్యాయి.
అమెరికాలో ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లు అయిన AT&T, స్ప్రింట్, టీ-మొబైల్, వెరిజాన్ సంస్థలు RCS ఆధారిత మెసేజింగ్ వ్యవస్థ రూపకల్పనకు నడుం బిగించాయి. RCS అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. ఈ మెసేజింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. మీరు మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా కూడా మెసేజ్ లను అందుకోవచ్చు. అంటే ఒక రకంగా ప్రస్తుతం దాదాపుగా ఎవరూ ఉపయోగించని మెసేజింగ్ యాప్.. ఏకంగా వాట్సాప్ కే చెక్ పెట్టే అవకాశం ఉందన్న మాట!
దీనికి సంబంధించిన ప్రయత్నాలు అమెరికాలో కొంతకాలం క్రితమే ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ఈ దీనికి గూగుల్ కూడా తన వంతు సాయం చేస్తోంది. అయితే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో పరిణామాలేవీ జరగలేదు. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రధాన సర్వీస్ ప్రొవైడర్లు దీని కోసం చేతులు కలపడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. RCS ఆధారిత మెసేజింగ్ వ్యవస్థని వచ్చే ఏడాది నాటికి ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని వీరు తెలిపారు. ఒకవేళ ఈ మార్పు నిజంగా జరిగి మెసేజింగ్ యాప్ విజయవంతమైతే.. వినియోగదారుల మొగ్గు దీనివైపే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే.. వాట్సాప్ మాతృసంస్థ అయిన ఫేస్ బుక్ పై వినియోగదారుల గోప్యత విషయంలో ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులున్నాయి.
RCS అందుబాటులోకి వచ్చాక జరిగే మార్పులివే..
1. మెసేజింగ్ క్యారెక్టర్స్ లిమిట్ 160 క్యారెక్టర్ల నుంచి ఒకేసారి 8,000 క్యారెక్టర్లకు పెరుగుతుంది.
2. వాట్సాప్ తరహాలో అవతలి వారు మెసేజ్ చదివితే రీడ్ రిసిప్ట్స్ రావడం, అవతల వారు టైప్ చేస్తున్నప్పుడు తెలిసే ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయి.
3. RCS చాట్ యాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు కూడా పంపుకోవచ్చు.
4. 100 వరకు సభ్యులతో గ్రూప్స్ ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
5. ఈ యాప్ మొబైల్ డేటా, వైఫైలపై పని చేస్తుంది.
అయితే ఇది సాధ్యమవ్వాలంటే.. సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థలు అన్నీ RCS చాట్ యాప్ కిందకి రావాలి. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రయత్నాలు అమెరికాలోనే జరుగుతున్నాయి. మనదేశంలో ఎప్పుడు సాధ్యమవుతుందనే దానిపై ఇప్పుడే మాట్లాడలేం. గోప్యత విషయంలో టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు ఎటువంటి భరోసా ఇస్తాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa