ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒటిఎస్ కు వ్యతిరేకంగా,,జిల్లా కేంద్రాల్లో టిడిపి ఆందోళనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 27, 2021, 08:04 PM

ఓటీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ  ఇచ్చిన పిలుపుమేరకు  శ్రీకాకుళం మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఒటిఎస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేటర్ల ఎదుట చేపట్టిన ఆందోళన పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినాధాలు చేశారు.  జిల్లా కేంద్రాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ఓటిఎస్ వసూళ్లు పేదలకు ఉరితాళ్లు అంటూ బ్యానర్లు ప్రదర్శించి భారీ నిరసన ర్యాలీలు చేశారు.  అనంతరం ఓటిఎస్నుల రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చారు. పలుచోట్ల పోలీసులు నిరసనకారులను అడ్దుకునే ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


 గుంటూరు కలెక్టరేట్ ఎదుట ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. ఈ సంఘటనలో  వేమూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త సునీల్ కాలు, మాచర్లకు చెందిన వెంకటేశ్వర్లు చేయి విరిగింది. గుంటూరు నగర కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ పై కూడా  పోలీసులు చేయిచేసుకోగా, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఒక్కసారిగా పరిగెత్తి కార్యకర్తల జోలికి వస్తే పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మహిళలు కూడా గాయపడ్డారు. గుంటూరులో ఓటీఎస్ రద్దు కోరుతూ టీడీపీ నిరసన ర్యాలీ గుంటూరు మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్ళిన పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్,  నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు. 


 ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటీఎస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమ వసూళ్లు పేదలకు ఉరితాళ్లుగా మారాయని  మండిపడ్డారు. ఓటీయస్ పథకం జగనన్న పైసా వసూలు పథకమని  వ్యాఖ్యానించారు. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి రూ. 5 వేల కోట్లు దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించిందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. పేదలు ఎవరికీ భయపడి డబ్బులు కట్టవద్దని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఓటీయస్ పేరుతో చేస్తున్న రిజిస్ట్రేషన్లు చెల్లుబాటుపై అనుమానాలు ఉన్నాయని, రేపు న్యాయస్థానాలు గానీ,  వేరే పార్టీ ప్రభుత్వం గానీ ఈ రిజిస్ట్రేషన్లు చెల్లవు అంటే డబ్బులు కట్టిన వారి పరిస్థితి ఏమిటని  ప్రశ్నించారు. ఓటీఎస్ కట్టాలంటూ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు వత్తిడి చేస్తున్నారు, ఓటీఎస్ కట్టకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపి వేస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఒకవైపు పథకం  స్వచ్చందమేనని చెబుతున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఏంటని నేతలు మండిపడ్డారు. ఓటేసిన పేదలను ఒటిఎస్ పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. పేద ప్రజలను భయబ్రాంతులకు, బెదిరింపులకు గురిచేయడం దురదృష్టకరమని అంటూ  గ్రామాల్లో ఎవరైనా ఒటిఎస్ చెల్లించాలని వత్తిడి తెస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa