ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర విమానప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

international |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 03:44 PM

పెరూలో పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే, పెరూవియన్ ఎడారిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. స్థానిక ఎడారిలోని నాజ్కా లైన్ల సందర్శన కోసం పర్యాటకులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. నాజ్కా విమానాశ్రయానికి కూత వేటు దూరంలోనే ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పైలట్​, కో-పైలట్‌తో పాటు ఐదుగురు పర్యాటకులు ఉన్నట్లు వివరించారు. సందర్శకుల్లో ముగ్గురు డచ్, మరో ఇద్దరు చిలీకి చెందినవారుగా గుర్తించినట్లు తెలిపారు.


ఆ దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా నాజ్కా లైన్లు ప్రసిద్ధిగాంచాయి. వీటి ప్రాముఖ్యతను గుర్తించి యునెస్కో సైతం ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు వస్తూ ఉంటారు. సందర్శన కోసం స్థానిక ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేకంగా విమానాలు ఉంటాయి. 2010 అక్టోబర్‌లో కూడా ఈ ప్రాంతంలోనే విమాన ప్రమాదం సంభవించింది. అందులో నలుగురు బ్రిటిషర్లు, ఇద్దరు పెరూవియన్‌ వైమానిక సిబ్బంది ప్రాణాలు విడిచారు. తాజా విమాన ప్రమాదంపై ఆ దేశ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa