ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు షాకిచ్చాయి. దీంతో నేతలు మేల్కొని ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటున్నారు.ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని సోనియా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పార్టీ హై కమాండ్ దృష్టిలో రెబల్ నేతగా కొనసాగుతున్న గులాంనబీ ఆజాద్… సోనియా గాంధీతో భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్ నాయకత్వ పని తీరుపై జీ-23 నేతలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో…ఆజాద్, గాంధీల సమావేశం అవుతుండడం గమనార్హం. జీ – 23 సభ్యుల తుది ప్రతిపాదనను హై కమాండ్ కు ఆజాద్ అందచేస్తారని తెలుస్తోంది.
మరోవైపు..బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దాలని.. కలిసివచ్చే పార్టీలతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ జీ 23 నేతలు లేఖ విడుదల చేశారు. 2022, మార్చి 16వ తేదీ బుధవారం కాంగ్రెస్ అసమ్మతి నేతలు, జీ 23 గ్రూపుగా ముద్రపడిన నాయకులు.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో భేటీ అయ్యారు. సీడబ్ల్యూసీ భేటీ, ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని సోనియా ఆదేశించిన తర్వాత జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్, గులానంబీ ఆజాద్, మనీశ్ తివారీ, భూపేందర్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, కురియన్, మణిశంకర్ అయ్యర్ తదితరులు హాజరయ్యారు.
శశిథరూర్ కూడా ఈ భేటీలో పాల్గొనడం ఆసక్తికర పరిణామం. సమిష్టి నిర్ణయాలతో పార్టీని కొత్త పుంతలు తొక్కించాలని ఉమ్మడిగా ఓలేఖ విడుదల చేశారు. తదుపరి చర్యలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు జి-23 నేతల సమావేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మళ్లికార్జున్ ఖర్గే విరుచుకుపడ్డారు. అలాంటి సమావేశాలు వంద జరిగినా సోనియా గాంధీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేరని, గల్లీగల్లీనుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ సోనియా వెంటే ఉందన్నారు. అలాంటి నేతలు సమావేశాలు జరుపుతూనే ఉంటారని, స్వీచ్‌లు ఇస్తూనే వుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వారు కేవలం పార్టీని చీల్చడానికే పదేపదే సమావేశం అవుతుంటారని విమర్శించారు.