కర్ణాటకలో తాము అధికారంలోకి వచ్చాక బెంగళూరు పూర్వ వైభవాన్నిపునరుద్దరిస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత డీ.కే.శివకుమార్ అన్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన తమకు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవంటూ మొన్న 'ఖాతాబుక్' కంపెనీ సీఈఓ సంధించిన ఆవేదనాభరిత ట్వీట్‌కు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చాలా వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. 'బెంగళూరులో వసతులు సరిగ్గా లేకపోతే... తక్షణమే మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండి' అంటూ కేటీఆర్ ఆయనను ఆహ్వానించిన సంగతి కూడా విదితమే. ఇక కేటీఆర్ ఇచ్చిన ఈ ఆహ్వానంపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సోమవారం ఒకింత ఘాటుగానే స్పందించారు. కేటీఆర్‌ను స్నేహితుడిగానే సంబోధించిన డీకే శివకుమార్..కేటీఆర్ ఆహ్వానాన్ని ఓ సవాల్‌గా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా 2023 చివరి నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన డీకే.. దేశంలోనే అత్యుత్తమ నగరంగా బెంగళూరుకు ఉన్న వైభవాన్ని పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.