జిల్లాల పునర్విభజనలో మరోసారి శ్రీకాకుళం జిల్లా కొంతభాగాన్ని కోల్పోయింది. 1978లో విజయనగరం జిల్లా ఏర్పాటు సమయంలో బొబ్బిలితో పాటు, కొన్ని ప్రాంతాలు మన నుంచి వేరుకాగా, తాజాగా రాజాం, పాలకొండ పట్టణాలతోపాటు 2 నియోజవర్గాలనే శ్రీకాకుళం జిల్లా వదిలేసుకుంది. ఈ పరిణామం జిల్లా అభివృద్ధిపై ప్రభావం పడనుంది. అయితే ఈ లోటును పూడ్చేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టగలిగితే శ్రీకాకుళం జిల్లాలో పర్యాటకంగా విస్తృత అవకాశాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, సుదీర్ఘ సముద్రతీరం ప్రాంతం, బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు మన సొంతం.
శ్రీకాకుళం నగరంలోని డచ్ బంగ్లాకు మెరుగులు దిద్దవచ్చు. జిల్లా కేంద్రాన్ని అనుకొని ఉన్న పొన్నాడ కొండపై మంజూరైన వుడా చిల్డ్రన్స్ పార్కు, శిల్పారామంను పూర్తి చేస్తే పర్యాటకులను ఆకట్టుకోనుంది. బారువ, కళింగపట్నం బీచ్ లను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చు. అరసవిల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం, ఎండల మల్లిఖార్జునస్వామి, మందస పెరుమాల్ ఆలయం, మెలియాపుట్టి రాధాకృష్ణ ఆలయాలకు మరింత ప్రచారం, ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పిస్తే ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులను భారీగా ఆకర్షించవచ్చు. శాలిహుండం, దంతపురి లాంటి బౌద్ధ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ భక్తులను ఆకట్టుకోవచ్చు. సిక్కోలు జిల్లాకు పర్యాటక అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ. ప్రభుత్వం, ప్రతినిధులు అధికారులు చొరవ చూపుతేనే అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది.