అప్పుల బాధతో బాపట్ల జిల్లా పంగులూరు మండలం చందలూరు గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందలూరుకు చెందిన సర్దన వీరాం జనేయులు (49) మూడేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేస్తున్నాడు. వరుస నష్టాలతో సుమారు రూ. 20 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. ఈ ఏడాది ఆరు ఎకరాల్లో మిర్చి సాగు చేయగా అధిక వర్షాలు, తెగుళ్లతో పంటపూర్తిగా దెబ్బతింది. దీంతో మిర్చి తొలగించి మొక్కజొన్న వేశాడు. దానికి కూడా చీడపీడలు సోకి పూర్తిగా దెబ్బతింది. దీంతో వీరాంజనేయులు కొద్దిరోజులుగా తీవ్ర మనోవేదనలో ఉన్నారు. మంగళవారం పంగులూరులో పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు గాలిస్తున్నా అచూకీ లభించలేదు. శనివారం రాత్రి రేణంగివరం పోలీస్ స్టేషన్లో ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులుమిస్సింగ్ కేసు నమోదుచేశారు.