మైనర్ భార్యతో శృంగారం చేయడం అత్యాచారం క్రిందకే వస్తుందని బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లు కంటే తక్కువ ఉన్న భార్యతో శారీరక సంబంధం పెట్టుకుంటే సదరు భర్త అత్యాచారం, పోస్కో, బాల్య వివాహాల నిరోధక చట్టాల ప్రకారం శిక్షార్హుడని తీర్పు చెప్పింది. మైనర్ భార్యపై భర్త అత్యాచారం చేసిన కేసు విచారణలో భాగంగా బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. భార్యపై అత్యాచారం కేసులో మినహాయింపునిచ్చే నిబంధనను సుప్రీం కోర్టు మార్చింది. ఇందులో భాగంగా భార్య వయస్సును 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు సుప్రీంకోర్టు పెంచింది. గతంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికతో భర్త లేదా ప్రియుడు లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారమే అని 2017 తీర్పులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.