పులివెందుల పట్టణంలో అభివృద్ధి పై దృష్టి సాధించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి వేలూరు శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. పట్టణం శివార్లలోని పులివెందుల-కదిరి వెళ్లే మార్గంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత వాసి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. పులివెందులను ఆదర్శనీయ పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిధులను వరదలా పారించారన్నారు. ఇందులో భాగంగా రోడ్ల విస్తరణ ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. అధికారులు కూడా ఆగమేఘాల మీద కొలతలు తీసుకున్నారని, ఇక కొద్ది రోజుల్లో విస్తరణ చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారన్నారు. మరి ఇంతలో ఏమైందో ఏమో కాని విస్తరణ పనులు మాత్రం అర్థాంతరంగా ఆగిపోయాయని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయం ఇప్పటికీ అధికారుల నుంచి స్పష్టతలేదన్నారు. కానీ ప్రస్తుతం ట్రాఫిక్ కు ఇబ్బందిగా లేని ప్రాంతాలల్లో ఇళ్లను కూల్చివేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. ఆదర్శనీయంగా పట్టణం కన్పించాలంటే ముందుగా రోడ్ల విస్తరణ జరగాలన్నారు. మరిఎప్పుటి నుంచి విస్తరణ ప్రారంభిస్తారు. లేదా అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణాలేమిటో ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.