అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించే క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో తలెత్తిన విభేదాలపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. శనివారం మీడియా సమావేశంలో చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు తాను వెళ్తే చందబ్రాబు, ఆయన అనుచరులు కనీసం మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకుండా తనను దుర్భాషలాడారన్నారు. మరోవైపు వారి హంగామాతో బాధితురాలు ఆందోళనకు గురైందన్నారు. బాధితుల వద్దకు పరామర్శకు వెళ్లినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలని తెలియదా అని ప్రశ్నించారు. టీడీపీ నేత బోండా ఉమ తనకు తాను పెద్ద నాయకుడినని అనుకుంటున్నారని, కృష్ణా జిల్లాలో అతడు చెడపుట్టాడని అన్నారు.
అత్యాచార ఘటనను రాజకీయం చేయడం తగదని టీడీపీకి సూచించారు. బాధితురాలున్న గదిలో 50 మంది గుంపుగా వచ్చి, కేకలు వేయడం సరికాదన్నారు. చంద్రబాబు యుద్ధం చేయడానికి వచ్చారా? పరామర్శకు వచ్చారో సూటిగా చెప్పాలన్నారు. బాధితురాలి పట్ల, తన పట్ల చంద్రబాబు, టీడీపీ నేతల వైఖరి బాగోలేదన్నారు. అందుకే మహిళా కమిషన్ సమన్లు అందజేసిందన్నారు. ఈ నెల 27న చంద్రబాబు, బోండా ఉమ మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.