దొడ్డకొప్పలు కరియప్ప రవి ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకనాడు కర్ణాటకలో చాలా మంది అవినీతి పరులను బెంబేలెత్తించిన వ్యక్తిగా నిలిచిపోయాడు. కేవలం 35 ఏళ్లకే చనిపోయిన కలెక్టర్ గా గుర్తుండిపోయాడు. ఈయన గురించి తెలిస్తే చాలా మంది ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. 2009 బ్యాచ్ నుండి కర్ణాటక కేడర్‌కు చెందిన భారతీయ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా ఈయన సుపరిచితుడు. డీకే రవి.. కర్ణాటకలో కలెక్టర్ ఉద్యోగం చేస్తూ అనేక మార్పులను తీసుకొచ్చారు.
ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియాలకు ఈయనంటే భయం. భారీ అవినీతిని ప్రజలకు తెలిసేలా చేసి వాటిని అరికట్టాడు. ప్రభుత్వ సొమ్మును అడ్డదారుల్లో ఖర్చు చేసేవారి అంతుచూస్తూ ఎన్నో ప్రజాప్రయోజనాలను చేకూర్చారు. పన్నులు ఎగొట్టిన వారి వద్ద నుంచి కేవలం రెండు వారల్లోనే రూ.150 కోట్ల పన్నులను వసూలు చేసిన ఘనత ఆయనదే. ఆయన పనిచేసిన 5 ఏళ్లలోనే ఎన్నో ట్రాన్స్ ఫర్సు అయ్యాయి. బెదిరింపు కాల్స్ వచ్చేవి. వాటన్నింటినీ డీకే రవి పట్టించుకోలేదు. ఎవరికీ భయపడకుండా న్యాయబద్దంగా నడిచాడు. కానీ 35 ఏళ్లకే ఆయన అనుమానాస్పద రీతిలో చనిపోయి కనబడ్డాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆయనది ఆత్మహత్యగా తేల్చారు. తక్కువ సమయంలోనే ఆయన చేసిన ఎన్నో పనులు ప్రజల మనసులో నాటుకుపోయాయి. ఆయన చనిపోయినా ప్రజలు మాత్రం కీర్తిస్తూనే ఉంటారు.