బాపట్ల జిల్లాలో నాటుసారా బట్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారని శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా తయారీని ఉపేక్షించేది లేదని బాపట్ల ఎస్పీ హెచ్చరించారు.
బాపట్ల జిల్లా పరిధిలోని లంక గ్రామాల్లో, శివారు బంగాళాఖాతం సముద్రం వైపు ఉన్న మడ అడవులలో నాటుసారా బట్టీలపై పోలీసులు మెరుపు దాడులు చేసి బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు.
పలువురు వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దాడుల్లో పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతు ప్రజల జీవనోపాధి కొరకు వివిధ రకాలైన వృత్తులను గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని, నాటుసారా అమ్మకం తయారీ దారులపై పోలీసు కేసులు నమోదు చేయడం వలన జైలు పాలవుతున్నారని వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు.
ప్రజలు మెరుగైన జీవనోపాధి కొరకు ప్రభుత్వాలు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవగాహనతో ఆరోగ్యాలకు హాని చేసే నాటు సారాకు దూరంగా ఉండాలన్నారు.
నాటుసారా తయారు చేయటం అమ్మటం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా అనేది జిల్లాలో ఎక్కడా కనబడ కూడదని, నాటుసారా తయారీని ఉపేక్షించేది లేదని, జిల్లా అంతటా నాటుసారా ఆనవాళ్లు కనబడకుండా ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ తెలిపారు.
నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా ఎస్పీ బాపట్ల హెల్ప్ లైన్ నెంబర్ 8333813228 తెలియజేయాలని ప్రజలను కోరారు.