అధిక రక్తపోటు(హై బీపీ) ఉన్న వారికి గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో వ్యాయామానికి, శారీరక శ్రమకు అంతా దూరం అవుతున్నారు. ఇలాంటి వారిలో హై బీపీ కనిస్తోంది. హై బీపీ కారణంగా తల తిరగడం, చాతీ నుంచి దవడ భాగం వరకు లాగుతున్నట్లు అనిపించడం వంటి గుండె ఆరోగ్యానికి ముప్పుగానే భావించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి ముప్పును అరికట్టే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడికాయ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త పోటును అదుపులో ఉండేలా చేస్తాయి. గుమ్మడికాయ గింజలు రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయని అధ్యయనాలలో తేలింది.
ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలలో రక్తపోటును అదుపులో ఉంచడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. రోజూ తగినంత సేపు నడుస్తూ, ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
బీన్స్, కాయధాన్యాలలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో సాయపడతాయి. బీన్స్, కాయధాన్యాలు తినడం వల్ల అధిక రక్తపోటు ముప్పు తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
చేపలు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా ఇవి రక్తనాళాలలోను వాపును తగ్గిస్తాయి. ఫలితంగా రక్తపోటును అదుపులో ఉంచుతాయి.