దేశంలో కరోనా వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గట్లేదు. కోవిడ్ 19 కథ మళ్లీ మొదటికొస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందనుకున్న దశలో కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. ఆర్- వేల్యూ క్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ రాజధానిలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. ప్రస్తుతానికి ఈ సంఖ్య అదుపులోనే ఉంది. అయినప్పటికీ- పలు రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నాయి.
మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. యాక్టివ్ కేసులు 17,000ను దాటేశాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి. ఇదివరకు ఈ సంఖ్య 12,000 లోపే ఉండేది. ఈ నాలుగైదు రోజుల్లోనే 17 వేలను దాటేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కోవిడ్ స్థితిగతులపై సమీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ సమావేశం ఉంటుంది.
ఈ పరిణామాల మధ్య కర్ణాటక ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను ధరించని వారిపై జరిమానా విధిస్తామని పేర్కొంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పీ రవికుమార్ తెలిపారు. ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రి కే సుధాకర్ ధృవీకరించారు.
నిజానికి- కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ ప్రొటోకాల్స్, ఆంక్షలను ఎత్తేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కోవిడ్ ఆంక్షలను తొలగించింది. మళ్లీ దీన్ని పునఃప్రవేశపెట్టింది. ఢిల్లీ, హర్యానా, తమిళనాడుల్లో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు పెరిగాయని, కర్ణాటకలోనూ పెరుగుదల చోటు చేసుకుందని రవికుమార్ తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు. పని చేసే స్థలంతో పాటు ఆర్టీసీ, సిటీ బస్సుల్లో ప్రతి ఒక్కరు మాస్కులను ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించామని, దీన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామనీ హెచ్చరించారు. రెండు అడుగుల భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని రవికుమార్ స్పష్టం చేశారు.