ఏపీలో బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు జిల్లాలో ప్రశ్నాపత్రం లీక్ వార్తలు రాగా కలెక్టర్ హరినారాయణన్ స్పందించారు. ఆయన సూచనతో అధికారులు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. వదంతులు వాస్తవమో, కాదోనని నిగ్గు తేల్చే పనిలో అధికారులు తలమునకలయ్యారు. దీనిపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు.
కాగా నేడు ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు మే 9వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల ప్రాంతంలో నిర్వహిస్తారు. మొత్తం 6,22,537మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 3,776 పరీక్ష కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ సారి ఏడు ఏడు పేపర్లతో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.