మజ్జిగ, సబ్జా, బార్లీ, సగ్గుబియ్యం వంటి వాటితో పాటు రాగిజావను కూడా వేసవిలో రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రాగిజావను తాగటం వల్ల డీహైడ్రేషన్, ఎండదెబ్బ, ముఖ్యంగా రక్త హీనత నుండి బయటపడవచ్చు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. కనుక రాగులను కేవలం వేసవిలోనే కాదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. రాగిజావను ఒక పదినిముషాల్లో తయారు చేసుకోవచ్చు. అంత సింపుల్. ఇందుకోసం మీ దగ్గర రాగుల పిండి (చోడి పిండి), బెల్లం, ఉంటే చాలు. ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల రాగి పిండికి కొంచెం నీటిని జోడించి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టుకుని అందులో తగినన్ని నీళ్లను పోసి బాగా కాచుకోవాలి. అవి బాగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకుని అందులో వేసుకోవాలి. మంటను సిమ్ లో ఉంచుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. అంతే రాగి జావ రెడీ..