దేశంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో రాబోయే ఐదు రోజులు మరింత అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో వడ గాల్పులు వీస్తాయని, ఐదు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మే మొదటి వారం వరకూ దేశవ్యాప్తంగా భారీగా ఎండ తీవ్రత ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో కూడా వడగాల్పులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉక్కపోతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు 12 గంటల తర్వాత బయటకు రాకుండా ఉండటమే మంచిదని ఐఎండి సూచించింది.