దేశ వ్యాప్తంగా విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తక్కువగా ఉత్పత్తి అవ్వడంతో ఆ ప్రభావం రైల్వే మీద పడింది. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల భారతీయ రైల్వే గత రెండు వారాలుగా రోజూ దాదాపు 16 మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ వస్తోంది. తాజాగా మే 24 వరకు దాదాపు 670 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 500 ట్రిప్పులు సుదూర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉండటం గమనార్హం.
బొగ్గు కొరత వల్ల రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా సగటున రోజువారీ లోడింగ్ 400కుపైగా రేక్‌లకు రైల్వే పెంచింది. విద్యుత్ ప్లాంట్లలో నిల్వలను పెంచడానికి, జులై-ఆగస్టులో వర్షాలతో బొగ్గు తవ్వకం తక్కువగా ఉన్నప్పుడు సంక్షోభాన్ని నివారించడానికి కనీసం మరో రెండు నెలల పాటు ఇదేవిధంగా ఉంటుందని రైల్వే శాఖ తెలియజేసింది.