విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా), నిబంధనలను ఉల్లంఘించిందనే కారణంతో షావోమీ(ఎంఐ) ఇండియా కంపెనీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన రూ.5,551.27 కోట్ల ఆస్తులను శనివారం జప్తు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ చేసిన అక్రమ చెల్లింపులకు సంబంధించి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం షియోమి 2014 లో భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2015 నుండి చైనాలోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి డబ్బును పంపించేది.
షియోమి ఇండియా మూడు విదేశీ ఆధారిత సంస్థల నుండి ఎటువంటి సేవలను పొందలేదని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఆయా కంపెనీలకు మాత్రం భారీగా నిధులు పంపిందని పేర్కొంది. విదేశాలలో ఉన్న కంపెనీలకు రాయల్టీ ముసుగులో భారీ మొత్తాన్ని షావోమీ ఇండియా కంపెనీ పంపించినట్లు తేలిందని ఈడీ చెబుతోంది. ఇది ఖచ్చితంగా ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తెలిపింది. విదేశాలకు డబ్బును పంపించేటప్పుడు కంపెనీ బ్యాంకులకు తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కూడా అందించిందని ఈడీ ఓ ప్రకటనలో వివరించింది.